Udhayanidhi Stalin Statement :తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, ఆ రాష్ట్ర యువజన, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను బ్రాహ్మణ, హిందూ సంఘాలతోపాటు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చెన్నైలో శనివారం జరిగిన తమిళనాడు ప్రగతిశీల రచయితలు, కళాకారుల సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించటం కాకుండా దాని నిర్మూలన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
Udhayanidhi Stalin Speech Latest :సనాతనం అంటే సమానత్వం, సామాజిక న్యాయానికి వ్యతిరేకం తప్ప మరొకటి కాదని ఉదయనిధి అన్నారు. సనాతనం అంటే శాశ్వతమైనదని, అది ప్రజలను కులాల వారీగా విభజిస్తుందని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. తన తాత, దివంగత సీఎం కరుణానిధి అన్ని కులాల వారు ఆలయ పూజారులు అయ్యేందుకు చట్టం తెచ్చారని, తన తండ్రి, ప్రస్తుత సీఎం స్టాలిన్ అర్చక శిక్షణ పొందిన అన్ని కులాల వారిని ఆలయ పూజారులుగా నియమించారన్నారు. ద్రవిడ నమూనా అంటే ఇదేనని ఉదయనిధి కితాబు ఇచ్చారు.
'క్షమాపణ చెప్పాలి'.. హిందూ సంఘాల డిమాండ్..
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు, విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా మండిపడుతున్నాయి. సనాతన ధర్మాన్ని ఎవరూ అంతం చేయలేరని.. అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ పేర్కొంది. సనాతన ధర్మం.. సంతోషం, శ్రేయస్సుకు నిదర్శనమని తెలిపింది. ఎన్నో మతాలు ఆవిర్భవించి .. అంతమయ్యాయని, సనాతన ధర్మం అంతమైతే పుట్టుకే ఉండదని అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ ప్రతినిధులు హెచ్చరించారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను హిందూ సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని, దేశ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఓ మతాన్ని రెచ్చగొట్టేలా, అవమానించేలా ఉన్నాయని.. సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని.. కోరారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రమాణం చేసిన ఉదయనిధి అన్నిమతాలను సమానంగా చూడకుండా ఉద్దేశపూర్వకంగా ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడారని న్యాయవాది వినీత్ జిందాల్ ఆరోపించారు.