Maharashtra politics crisis: ముఖ్యమంత్రి పదవిని భాజపా, శివసేన చెరో రెండున్నరేళ్లు పంచుకుందామన్న తన ప్రతిపాదనకు 2019లో అమిత్ షా అంగీకరించి ఉంటే.. మహారాష్ట్రలో ఇంతటి రాజకీయ సంక్షోభం తలెత్తేదా అని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. శివసేనలో తిరుగుబాటు, సంకీర్ణ ప్రభుత్వం పతనం, కొత్త సర్కారు ఏర్పాటు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా, శివసేన మిత్రపక్షాలుగా ఎన్నికల్లో గెలిచి, మహారాష్ట్రలో అధికారం చేపట్టిన నాటి సంగతుల్ని గుర్తు చేశారు.
"2019లో శివసేన- భాజపా కూటమి గెలిచాక అమిత్ షాకు ఒక మాట చెప్పా. శివసేనకు చెందిన వ్యక్తి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతిపాదించా. అందుకు వారు అప్పుడే అంగీకరించి ఉంటే అసలు మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు. ఇప్పుడు ఈ తరహాలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. శివసేన కార్యకర్త అని చెప్పుకునే ఓ వ్యక్తిని(ఏక్నాథ్ శిందేను) ముఖ్యమంత్రిని చేశారు. ఆయన శివసేన సీఎం కాదు. మనం కూటమిగా ఉన్నప్పుడే మీరు ఒప్పుకుని ఉంటే.. ఇదంతా(ప్రభుత్వం ఏర్పాటు) ఎంతో గౌరవప్రదంగా జరిగి ఉండేది" అని అన్నారు ఉద్ధవ్.
శివసేనలో తిరుగుబాటును.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంగా, ప్రజా తీర్పును కాలరాయడంగా అభివర్ణించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందేను ఎన్నుకోవడంపై భాజపాను తీవ్రంగా విమర్శించారు ఠాక్రే. 2019లో రెండున్నరేళ్ల పాటు ఇరు పార్టీలు సీఎం పదవిని పంచుకోవడంపై.. భాజపా ఇచ్చిన హామీని ఎందుకు విస్మరించిందని ప్రశ్నించారు. తనపై ఉన్న కోపాన్ని ముంబయి వాసులపై ప్రదర్శించవద్దని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. మెట్రో కార్ షెడ్‌ను ముంబయిలోని కంజూర్‌మార్గ్ నుంచి ఆరే కాలనీకి తరలించాలన్న ఏక్నాథ్ సర్కార్ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. పర్యావరణంతో చెలగాటం ఆడకుండా మెట్రో కార్ షెడ్‌ను కంజూర్మార్గ్లోనే కొనసాగించాలని కోరారు. ఆరే కాలనీలో వన్యప్రాణులు ఉన్నాయని.. ఆ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించానని ఆయన చెప్పారు.
జులై 3 నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు: మహారాష్ట్ర ప్రభుత్వ బల పరీక్ష నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు జులై 3న ప్రారంభం కానున్నాయి. జులై 4న బలపరీక్ష నిర్వహించనున్నట్లు శాసనసభా కార్యదర్శి వెల్లడించారు. ఈ సమావేశంలోనే అసెంబ్లీకి స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. స్పీకర్ పదవికి జులై 2 మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా స్పీకర్ పదవికి భాజపా ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో జులై 2, 3న సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఈ తేదీల్లో మార్పులు చేశారు.
సుప్రీంకు ఠాక్రే వర్గం: ఏక్ నాథ్ శిందే వర్గం ఎమ్మెల్యేల తిరుగుబావుటాతో మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శిందే సహా కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత విషయం తేలేంతవరకు వారిని అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. శిందే, 15 మంది ఎమ్మెల్యేలు.. ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం వల్ల వారిపై డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై శిందే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించగా జులై 11 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అప్పటి ప్రభుత్వానికి తెలిపింది. అనంతరం జరిగిన పరిణామాలతో శిందే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. శిందే ప్రస్తుతం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అందుకు గవర్నర్ సోమవారం వరకు గడువు విధించారు. దీంతో ఠాక్రే వర్గం మరోమారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత అంశం పెండింగ్‌లో ఉన్నందున.. అప్పటిదాకా వారు అసెంబ్లీలోకి రాకుండా సస్పెండ్ చేయాలని కోరింది. వారు సభా కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేసింది.