గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెరవెనుక అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే భేటీ తర్వాత వచ్చిన స్పందనలు గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
మోదీ-ఉద్ధవ్ సమావేశం అనంతరం శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. సేన తిరిగి ఎన్డీఏలో చేరాలని కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అఠవాలే సూచించారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ కూడా శివసేనను ప్రశంసించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ప్రకటించారు. వీరి వ్యాఖ్యలను పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు మహా రాజకీయాల్లో ఏదో జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు.
మోదీపై రౌత్ ప్రశంసలు
అవకాశం దొరికినప్పుడల్లా భాజపాపై విరుచుకుపడే శివసేన నేత సంజయ్ రౌత్.. మోదీ-ఉద్ధవ్ భేటీ తర్వాత ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మోదీ దేశంలోనే అగ్ర నాయకులని, ప్రధాని కూడా అయినందున ఆయనను అందరూ గౌరవించాలన్నారు. భాజపా-శివసేన మధ్య ఉన్న విభేదాలు శాశ్వతం కాదని, ఏదో ఒక రోజు సమసిపోతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, ఠాక్రే భేటీ అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం సాధారణమేనని చెప్పారు.
'మహా వికాస్ అఘాడీకి ఢోకా లేదు'
సంజయ్ రౌత్ వ్యాఖ్యల అనంతరం మహారాష్ట్రలో మాహా వికాస్ అఘాడీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. కానీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ మాత్రం దీన్ని తోసిపుచ్చారు. తమ ప్రభుత్వం బలంగా ముందుకు సాగుతుందని, ఎవరూ దీన్ని కూల్చలేరని ధీమా వ్యక్తం చేశారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని కితాబిచ్చారు.