తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నమ్మకం పోయింది.. ఈసీని రద్దు చేయండి'.. ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ ఫైర్​ - శివసేన సుప్రీం కోర్టు కేసు

ఎన్నికల కమిషన్​పై ఉద్ధవ్‌ ఠాక్రే మండిపడ్డారు. శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై హడావుడిగా నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కమిషనర్లను ప్రభుత్వం నియమించకూడదని, ప్రజలే ఎన్నుకోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

uddhav-thackeray-comments-on-election-commission-of-india
Etv Bharatఎన్నికల సంఘంపై ఉద్ధవ్ వ్యాఖ్యలు

By

Published : Feb 20, 2023, 9:08 PM IST

Updated : Feb 20, 2023, 9:59 PM IST

శివసేన పార్టీ పేరు, గుర్తును ఎన్నికల సంఘం శిందే వర్గానికి కేటాయించడంపై సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్లిన ఉద్ధవ్‌ ఠాక్రే.. కొన్ని గంటలకే ఈసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరు, గుర్తు విషయంలో ఇంత హడావుడిగా ఈసీ ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘంపై నమ్మకం పోయిందన్న ఉద్ధవ్.. ఈసీని రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం కమిషనర్లను ప్రభుత్వం నియమించకూడదని, ప్రజలే ఎన్నుకోవాలని పేర్కొన్నారు.

శివసేన పేరును, గుర్తును ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గానికి అప్పగించాలన్న ఈసీ నిర్ణయం పూర్తిగా తప్పన్నారు. పార్టీ పేరు, గుర్తును ఇలా ఒక వర్గానికి ఇచ్చిన సందర్భం లేదని చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎన్నికల సంఘం వేచి ఉండాల్సిందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. శివసేన పార్టీ పేరు, గుర్తులను ఏక్ నాథ్ శిందే దొంగిలించగలరేమో కానీ.. ఠాక్రే పేరును దొంగిలించలేరని మండిపడ్డారు. పార్టీ పేరు, గుర్తు విషయంలో సుప్రీంకోర్టే తమ ఆశాకిరణం అని ఉద్ధవ్ పేర్కొన్నారు. శివసేనను అంతమొందించాలని భాజపా చూస్తోందని.. తమ పార్టీ పేరు, గుర్తును లాక్కోవడం వారి కుట్రలో భాగమేనని ఉద్ధవ్ ఆరోపించారు.

శివసేన పార్టీ పేరు, గుర్తులను ఏక్ నాథ్ శిందే వర్గానికి కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై అత్యవసర విచారణ చేపట్టాలన్న ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. అత్యవసర విచారణ జాబితాలో చేర్చాలని ఠాక్రే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టును అభ్యర్థించగా.. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయన్న సీజేఐ.. సరైన ప్రక్రియను అనుసరించి మంగళవారం న్యాయస్థానం ముందుకు రావాలని సూచించారు.

శివసేన పార్టీ గుర్తు, పేరు వివాదంపై ఠాక్రేకు చెందిన సామ్నా పత్రిక సైతం విమర్శలు గుప్పించింది. ఆస్తి రాసిచ్చినట్టు శివసేన పేరు, గుర్తును శిందేకు కట్టబెట్టారని ఈసీని తప్పుబట్టింది. 'దుకాణాల్లో పల్లీలు కొన్నట్టు శివసేన పేరు, ఎన్నికల గుర్తును కొనేశారు. ఈ వ్యవహారాన్ని ఆస్తి లావాదేవీగా ఈసీ మార్చేసింది. ఠాక్రేలు స్థాపించిన పార్టీని దిల్లీకి చెందిన వారి కాళ్లు పట్టుకునే వ్యక్తులకు పార్టీని అప్పగించింది. అమిత్ షాకు అనుకూలంగానే ఈసీ నడుచుకుంది. ఆయన మహారాష్ట్రకు శత్రువు. ఆయనతో కలిసి ఉన్నవారినీ అలాగే చూడాలి' అని పత్రిక సంపాదకీయం పేర్కొంది.

ఓవైపు పార్టీ పేరు, గుర్తుపై వివాదం కొనసాగుతుండగా.. శిందే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని శివసేన కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. నిజమైన శివసేన శిందే వర్గానిదేనని ఈసీ నిర్ణయించిన నేపథ్యంలో శాసనసభలోని కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీ సభ్యులతో చర్చించిన తర్వాత రాష్ట్రంలోని శివసేన పార్టీ కార్యాలయాలనూ తమ అధీనంలోకి తీసుకుంటామని శిందే వర్గం ఎంపీ ప్రతోద్ భరత్ గోగావలే వెల్లడించారు.

Last Updated : Feb 20, 2023, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details