అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి సచిన్ వాజేను మహారాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ఆరోపించారు. సస్పెన్షన్కు గురైన వాజేకు తిరిగి పదవిని కేటాయించాలని 2018లో శివసేన తనపై ఒత్తిడి తెచ్చిందని అన్నారు.
"2018లో నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు.. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. నా వద్దకు వచ్చి, సచిన్ వాజేకు పదవి తిరిగివ్వాలని కోరారు. శివసేన పార్టీకి చెందిన కొందరు మంత్రులు కూడా ఇదే విధంగా అభ్యర్థించారు. ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు నేను అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్నాను. బాంబే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వాజేను సస్పెండ్ చేసినందున ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వలేనని తేల్చి చెప్పాను.''
- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి