Rajasthan Tailor murder:రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో టైలర్ దారుణ హత్య నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాజసముంద్ జిల్లాలోని భీమ్ పట్టణంలో ఓ వర్గం.. స్థానిక మసీదు వైపుగా ర్యాలీగా వెళ్లడం ఉద్రిక్తతలకు దారి తీసింది. 'మతపరమైన స్థలంపై దాడి చేసేందుకు కొంతమంది ర్యాలీగా వెళ్లారు. పోలీసులపై రాళ్లు సైతం విసిరారు. మసీదు వైపు వెళ్లకుండా నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ గుంపులో ఉన్న ఓ వ్యక్తి పోలీసుపై ఖడ్గంతో దాడి చేశాడు. గాయపడ్డ పోలీసును ఆస్పత్రికి తరలించాం' అని డీజీపీ ఎంఎల్ లాఠర్ తెలిపారు.
Rajasthan protest tailor murder: మరికొన్ని ప్రాంతాల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయని అధికారులు తెలిపారు. రాజ్సముంద్లో హిందూ వర్గాలు నగర పరిషత్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించాయని పేర్కొన్నారు. కొందరు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారని వెల్లడించారు. వారిని నియంత్రించేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపు చేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు, అనూప్‌గఢ్‌లో హిందూ సంఘాలు సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశాయి. హనుమాన్ ఛాలిసాను పఠించాయి.