తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తౌక్టే ఎఫెక్ట్​: పశ్చిమ తీరానికి భారీ నష్టం - తౌక్టే తుపానుకు గుజరాత్​లో నష్టం

సోమవారం అర్ధరాత్రి గుజరాత్ సౌరాష్ట్ర పరిధిలో తీరం దాటిన తౌక్టే తుపాను పశ్చిమ తీరంలో విధ్వంసం సృష్టిస్తోంది. గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో.. భారీగా చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు కూడా భారీ సంఖ్యలో విరిగిపడ్డాయి. తీరం దాటే సమయంలో కురిసిన కుండపోతతో సౌరాష్ట్ర పరిధిలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. సైన్యం, విపత్తు నిర్వహణ బలగాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.

Typhoon Toukte
తౌక్టే

By

Published : May 18, 2021, 8:47 PM IST

దేశ పశ్చిమ తీరంలో తౌక్టే తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో తుపాను భారీ నష్టాన్ని కలిగించింది. తీరం దాటిన తర్వాత అతి తీవ్ర తుపానుగా ఉన్నప్పటికీ గాలుల వేగం గంటకు 115 కిలోమీటర్ల నుంచి 125 కిలోమీటర్ల మధ్య ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. తుపాను తీరం దాటినప్పటికీ విధ్వంసం కొనసాగుతూనే ఉందని పేర్కొంది. ప్రస్తుతం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. తుపాను ప్రభావంతో సౌరాష్ట్ర ప్రాంతం సహా గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

అయితే.. అహ్మదాబాద్​కు నైరుతిలో 120కిలోమీటర్ల దూరంలో, సురేంద్రనగర్​కు ఈశాన్యంలో 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రంగా ఉన్న తుపాను మరో 3 గంటల్లో బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

తుపాను దాటికి పంట నష్టం

16 వేల ఇళ్లు ధ్వంసం..

తౌక్టే తీరం దాటుతున్న సమయంలో సౌరాష్ట్ర పరిధిలో భారీ ఎత్తున వృక్షాలు నేల కూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఫలితంగా వేలాది మంది గతరాత్రి నుంచి అంధకారంలోనే ఉండిపోయారు. తీవ్ర గాలుల ధాటికి తాత్కాలిక నిర్మాణాలు కూడా కుప్పకూలాయి. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. సైన్యంతో పాటు విపత్తు నిర్వహణదళాలు సహాయకచర్యలు ముమ్మరం చేశాయి. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు గిర్ సోమ్ నాథ్, ఆమ్రేలి, భావ్ నగర్ , వల్సాడ్ లోని అనేక ప్రాంతాల్లో వరుణుడు కుండపోత పోశాడు. గిర్ సోమ్ నాథ్ పరిధి ఉనా తాలూకాలో 12 గంటల వ్యవధిలో అత్యధికంగా 175 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుజరాత్ లో తౌక్టే ధాటికి 16 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని 40 వేల వరకు చెట్లు కూలాయని వెయ్యి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.

సహాయక చర్యల్లో సిబ్బంది

కొవిడ్ రోగుల చికిత్సకు అంతరాయం..

సౌరాష్ట్ర పరిధిలో 159 రహదారులు దెబ్బతిన్నాయని, 196 రోడ్లు వివిధ కారణాలతో మూసేశామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి చెప్పారు. దాదాపు 2 వేల 437 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా 484 గ్రామాలను పునరుద్ధరించినట్లు తెలిపారు. గుజరాత్ వ్యాప్తంగా దాదాపు 14 వందల ఆస్పత్రుల్లో కొవిడ్ రోగులకు చికిత్సలో అంతరాయం ఏర్పడిందని రూపాణి వెల్లడించారు. అనేక ప్రాంతాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లలో కూడా సమస్యలు తలెత్తాయని తెలిపారు. గోవాలోని వెంగ్రూలా లైట్ హౌస్‌ వద్ద ఇరుక్కుపోయిన ఇద్దరు ఉద్యోగులను చెతక్ హెలికాప్టర్‌ ద్వారా తీరప్రాంత గస్తీ దళ సిబ్బంది కాపాడారు.

తౌక్టే ఉద్ధృతి

ముంబయిలోనూ..

తౌక్టే ధాటికి ముంబయిలో గడచిన 24 గంటల్లో 23 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం తౌక్టే పశ్చిమ మహారాష్ట్రలో సృష్టించిన బీభత్సానికి దాదాపు 23 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద కొన్ని నిర్మాణాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన నిర్మాణానికి ఎటువంటి నష్టం జరగలేదన్న అధికారులు... అలల తాకిడికి సమీపంలో ఉన్న ఫుట్‌పాత్‌లో కొతం భాగం దెబ్బతిన్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:రెండు వర్గాల మధ్య ఘర్షణ- ఒకరు మృతి

:మహిళపై విరిగిపడ్డ చెట్టు- చివరకు...

ABOUT THE AUTHOR

...view details