ముఖ్యమంత్రి వెళ్తున్న విమానంలోనే ప్రయాణిస్తున్న ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. నల్ల చొక్కా ధరించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన కేరళలోని కన్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్లే విమానంలో జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు నిరసన సెగ తగిలింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
విజయన్ ప్రయాణిస్తున్న విమానంలోనే ఉన్న ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. నల్ల చొక్కా ధరించి.. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనకు దగ్గరగా వెళ్లారు. అప్రమత్తమైన ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్.. వారిని వెనక్కి నెట్టేశారు. వారు నినాదాలు చేస్తుండగా జయరాజన్ వారిని తోసేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. విమానంలో నిరసనలు చేపట్టిన యూత్ కాంగ్రెస్ మట్టన్నుర్ బ్లాక్ అధ్యక్షుడు ఫర్సిన్ మజీద్, కన్నూర్ జిల్లా సెక్రెటరీ ఆర్కే నవీన్ కుమార్‌ను.. కన్నూర్ విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. అయితే, తాము వైద్యం కోసం తిరువనంతపురం వెళ్తున్నామని చెప్పగా అనుమతించినట్లు తెలిపారు.