తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యాక్సిడెంట్​లో 33మంది మృతి.. ఆ పాప మాత్రం సేఫ్.. చనిపోయిన తల్లి గుండెను 12గంటలు హత్తుకుని..

రెండేళ్ల పాప.. ఘోర బస్సు ప్రమాదం నుంచి మృత్యుంజయురాలిగా బయటపడింది. 33 మంది చనిపోయిన దుర్ఘటనలో అదృష్టవశాత్తూ సురక్షితంగా ఉంది. చనిపోయిన తల్లి గుండెను హత్తుకుని, బిక్కుబిక్కుమంటూ గడుపుతూ.. అనేక గంటల తర్వాత సహాయక సిబ్బంది కంటపడింది.

uttarakhand wedding bus accident
'మృత్యుంజయరాలి'గా రెండేళ్ల పాప.. చనిపోయిన తల్లి గుండెను హత్తుకుని 12గంటల తర్వాత...

By

Published : Oct 6, 2022, 11:58 AM IST

Updated : Oct 6, 2022, 12:44 PM IST

500 మీటర్ల లోయ.. బండ రాళ్లు, చెట్లతో నడిచేందుకు కూడా వీలు కాని ప్రాంతం.. రోడ్డుపై నుంచి పడి తుక్కుతుక్కు అయిన బస్సు.. 33 మంది మృతితో రక్తసిక్తమైన ప్రదేశం! అలాంటి చోట రెండేళ్ల పాప మృత్యువును జయించింది. ఉత్తరాఖండ్​ పౌడీ జిల్లాలో పెళ్లి బృందాన్ని బలిగొన్న ఘోర ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది. దుర్ఘటన జరిగిన తర్వాత దాదాపు 12 గంటలపాటు.. చనిపోయిన తల్లి గుండెను హత్తుకుని అలానే బిక్కుబిక్కుమంటూ గడిపింది. చివరకు సహాయక సిబ్బంది కంపడింది.

మంగళవారం ఉత్తరాఖండ్​ పౌడీ జిల్లా ధూమకోట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రిఖినికల్- బిరోఖాల్ రహదారిపై వెళ్తున్న పెళ్లి బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోతున్న న్యార్ నదిలో పడిపోయింది. రాత్రి 7.30 సమయంలో జరిగిన ఈ దుర్ఘటన.. అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. అదే బస్సులో పెళ్లి కుమారుడి బంధువైన రసూల్​పుర్​ కస్బే వాసి గుడియా దేవి, ఆమె రెండేళ్ల కుమార్తె దివ్యాంశీ కూడా ఉన్నారు. బస్సు అదుపు తప్పిందని గుర్తించిన వెంటనే గుడియా దేవి.. కుమార్తెను గట్టిగా పట్టుకుంది. తల్లి ప్రాణాలు కోల్పోగా.. బిడ్డ మాత్రం అలానే ఆమె గుండెను హత్తుకుని ఉండిపోయింది.

ప్రమాద తీవ్రతకు బస్సు తుక్కుతుక్కు అయింది. మృతదేహాలు లోయలో చెల్లాచెదురుగా పడ్డాయి. గాయపడ్డవారిలో కొందరు.. మంగళవారం రాత్రి అతి కష్టం మీద కొండ ఎక్కి, రోడ్డుపైకి వచ్చి.. అటుగా వెళ్తున్న వారికి విషయం చెప్పారు. వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం(ఎస్​డీఆర్​ఎఫ్​) సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనేక గంటలపాటు శ్రమించి.. మృతదేహాలు వెలికి తీశారు. ఈ క్రమంలోనే గుడియా దేవిని హత్తుకుని ఉన్న ఆమె కుమార్తె దివ్యాంశీని బుధవారం గుర్తించారు. వెంటనే ఆ చిన్నారిని రక్షించి, ఇంటికి చేర్చారు. దివ్యాంశీ పదేపదే తల్లిని గుర్తు చేసుకుంటోందని, ఆమెను సముదాయించడం తమ వల్ల కావడం లేదని బంధువులు చెబుతున్నారు.

తీవ్ర విషాదంలో గుడియా దేవి కుటుంబ సభ్యులు

పెళ్లికి వెళ్తూ..
ప్రమాదానికి గురైన బస్సు.. పెళ్లి బృందంతో వెళ్తోంది. హరిద్వార్​లోని లాల్​గఢ్​కు చెందిన ఓ యువకుడి వివాహం కోసం.. అతడి బంధుమిత్రులు దాదాపు 46 మంది కలిసి మంగళవారం మధ్యాహ్నం పౌడీ జిల్లాలోని కాండా గ్రామానికి బస్సులో బయలుదేరారు. మంగళవారం ఏడున్నర గంటలయ్యే సరికి.. వారు గమ్యస్థానానికి దాదాపు చేరువయ్యారు. ఇంతలోనే అనూహ్య సంఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. బిరోఖాల్ ప్రాంతంలోని సిమ్డీ గ్రామం వద్ద రోడ్డు పక్కనున్న న్యార్​ నదిలో పడిపోయింది.

Last Updated : Oct 6, 2022, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details