Two Trains On The Same Track : ఒడిశాలో జరిగిన కోరమాండల్ రైలు దుర్ఘటన తరహాలోనే ఛత్తీస్‌గఢ్‌లోనూ ప్రమాదం జరిగి ఉండేదని, అయితే లోకో పైలట్ల అప్రమత్తతో ఘోర ప్రమాదం తృటిలో తప్పిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చాయని.. అయితే,లోకో పైలట్లు చాకచక్యంగా వాటిని కేవలం కొన్ని అడుగుల దూరంలో నిలిపివేయడంతో ప్రమాదం తప్పిందనేది ఆ వీడియో సారాంశం.
అయితే దీనిపై రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. ప్రమాదవశాత్తు ఆ రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పైకి రాలేదని స్పష్టంచేసింది. బిలాస్‌పుర్-జైరాంనగర్ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని, రైల్వే నిబంధనల ప్రకారం.. ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న మార్గంలో ఎదురుదురుగా రెండు రైళ్లు వచ్చేందుకు అనుమతి ఉందని చెప్పింది. అయితే, ఒకే ట్రాక్‌లో వచ్చిన రెండు రైళ్లు ఢీకొట్టుకోబోవని, సమీపంలోకి వచ్చిన తర్వాత రెండు రైళ్లకు రెడ్ సిగ్నల్ పడి.. కొద్ది దూరంలోనే ఆగిపోతాయని వివరణ ఇచ్చింది.
ఒకే ట్రాక్‌పై ప్యాసింజర్, గూడ్స్! ఇటీవల ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 285 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1200 మందికిపైగా గాయపడ్డారు. లూప్‌లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్సు రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది. అదే సమయంలో అటువైపు వెళ్తున్న హావ్‌డా-యశ్వంత్‌పూర్ రైలు కూడా ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమే ఈ ఘోరానికి కారణమై ఉంటుందని రైల్వేశాఖ ప్రాథమికంగా నిర్థారించింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ప్రమాదం జరిగి ఉండేదంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడం చర్చనీయాంశమైంది.
అయితే ఒడిశా రైలు ప్రమాదం జరిగి పది రోజులైన నేపథ్యంలో బహనగా గ్రామస్థులు.. మృతులకు సామూహిక నివాళులు అర్పించారు. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు.. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. హిందూ ఆచారాల ప్రకారం.. గ్రామానికి చెందిన పురుషులు గుండు గీయించుకున్నారు. అనంతరం పసుపు రాసుకుని చెరువులో స్నానాలు చేశారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు సంస్మరణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.