కశ్మీర్‌లో మైనార్టీలే లక్ష్యంగా ఉగ్రవాదులు వరుసగా దాడులకు తెగబడుతున్నారు. రెండ్రోజులక్రితం ఓ కశ్మీర్ పండిట్‌సహా ఇద్దరు పౌరులను కాల్చిచంపిన ఘటన మరువకముందే శ్రీనగర్‌లో.. మరో ఇద్దరు మైనార్టీలను చంపారు. సంగం ఈద్గా ప్రాంతంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు సహా మరో టీచర్‌ను కాల్చి చంపారు. వారిలో ఒకరు కశ్మీర్ పండిట్ కాగా, మరొకరు సిక్కు అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉదయం 11.15 నిమిషాలకు జరిగినట్లు చెప్పారు.
ఉగ్రదాడి సమాచారం అందిన వెంటనే దుండగులను పట్టుకునేందుకు.. ఆప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రెండ్రోజుల ముందు ముగ్గురి హత్య..
రెండ్రోజుల ముందు కూడా శ్రీనగర్‌కు చెందిన ప్రముఖ ఫార్మసి యజమాని, కశ్మీర్ పండిట్‌సహా మరో ఇద్దరు పౌరులను ఉగ్రమూకలు కాల్చిచంపాయి. గంటన్నర వ్యవధిలోనే ఈ ముగ్గుర్ని చంపారు. ప్రముఖ కశ్మీర్ పండిట్, వ్యాపారవేత్త అయిన మఖన్‌లాల్ బింద్రూ.. ఇక్బాల్ పార్క్‌లోని తన దుకాణంలో మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఔషధాలు బట్వాడా చేస్తుండగా.. దుండగులు పాయింట్ బ్లాంక్‌లో ఆయన్ను కాల్చిచంపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం. ఆ తర్వాత హవల్ చౌక్ ప్రాంతంలో రోడ్డువెంట పానీపూరి విక్రయించే బిహార్ బాగల్‌పూర్‌కు చెందిన వీరేంద్ర పాసవాన్‌ను కూడా ఉగ్రవాదులు కాల్చిచంపారు. అనంతరం బందిపొర జిల్లాలో ఓ కారు డ్రైవర్‌ను ఉగ్రమూకలు కాల్చిచంపాయి. నిషేధిత లష్కర్ తొయిబాకు అనుబంధ సంస్థగా భావిస్తున్న టీఆర్ఎఫ్.. ఈ హత్యలకు బాధ్యత తీసుకుంది.
మరోవైపు.. తమవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు వరుసగా దాడులకు తెగబడటం వల్ల కశ్మీర్ పండిట్లకు చెందిన వివిధ సంఘాలు జమ్ములో ఆందోళనకు దిగాయి. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ వర్గాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసిన నేపథ్యంలో.. భద్రత పెంచాలని డిమాండ్ చేశారు.