ఒక్కొక్క రూపాయి కూడబెట్టి కట్టుకున్న పొదిరిల్లు.. వరదలు వచ్చినప్పుడల్లా నీట మునిగిపోతుంది. నివాసం ఉండే యజమానులు పునరావాస కేంద్రానికి తరలిపోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చాలనుకొన్నారు కేరళ కోజికోడ్‌కు చెందిన పుష్పరాజ్. మార్కెట్లో ఉన్న నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని 15ఏళ్ల కిందట నిర్మించిన తన రెండు అంతస్తుల ఇంటిని ఆరు అడుగుల మేర పైకి లేపారు. భవిష్యత్తులో ప్రకృతి ప్రకోపించినా తట్టుకునేలా తిరిగి పునాది నిర్మాణం చేపడుతున్నారు.
"2018, 2020లో వచ్చిన వరదలకు మా ఇల్లు మునిగి పోయింది. 15ఏళ్ల కిందట నిర్మించింది కావడం వల్ల బాగా దెబ్బతింది. 2019లో మా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సుమారు ఏడన్నర అడుగుల మేర నీరు చేరుకుంది. నడుము లోతు నీటిలో చిక్కకుపోయాం. మమ్మల్ని పునరావాస కేంద్రానికి తరలించారు. చాలా మేరకు సామగ్రి ధ్వంసం అయ్యింది. అటువంటి ఇబ్బందికర అవస్థను మళ్లీ పడకూడదని ఇంటిని వీలైనంత మేర పైకి లేపాలి అనుకున్నాం."
- పుష్పరాజ్, యజమాని
సాంకేతికతతో ముందడుగు..
ఇంటిని మొత్తాన్ని పైకి లేపడం అంటే సామన్యమైన ప్రక్రియ కాదు. బేస్ నుంచి ఇంటిని వేరు చేయాలి. అంగుళం కూడా కదలకుండా యథాతథంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు ఎన్నో ఇనుప జాక్‌లతో ఏకకాలంలో ఈ పని చేపట్టాలి. ఇలా చేసేందుకు కోజికోడ్‌లోని ఓ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. ఇందుకు సంబంధించిన పని వారిని మాత్రం ఝార్ఖండ్, హరియాణా నుంచి రప్పించారు.