Two Sons Murdered Father: కశ్మీర్లో అమానవీయ ఘటన జరిగింది. కన్నతండ్రినే(62) ఇద్దరు కుమారులు కలిసి హత్య చేశారు. అనంతరం దీన్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని దాల్ సరస్సులో పడేశారు. అయితే.. ఏప్రిల్ 7న వృద్ధుడి మృతదేహం దాల్ సరస్సులో తేలియాడుతుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు శ్రీనగర్ నివాసి కుర్షిద్ అహ్మద్ తోటా(62)గా గుర్తించి పోస్టుమార్టానికి పంపారు.
రిపోర్టుల్లో కుర్షిద్ హత్యకు గురయ్యాడని తేలింది. మెడపై గాట్లు కనిపించాయి. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. గుర్తుతెలియని వ్యక్తులు ఈ హత్య చేశారని ప్రాథమిక దర్యాప్తులో భావించారు. కానీ సీసీటీవీ ఆధారాలతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితున్ని సొంత కొడుకులే హత్య చేశారని పోలీసులు కనిపెట్టారు. హత్యను ప్రమాదంగా చిత్రించడానికి మృతదేహాన్ని ఒక రోజు ఇంట్లో ఉంచి, అనంతరం దాల్ సరస్సులో పడేశారని వివరించారు.
నరికి చంపి:కేరళ కొల్లాం జిల్లాలో దారుణం జరిగింది. కొక్కడ్ శివ దేవాలయం ఉత్సవాల్లో ఓ యువకున్ని దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మెడపై నరికి, వేళ్లను శరీరం నుంచి వేరు చేశారు. రోడ్డు పక్కన పడి ఉన్న మనోజ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు మనోజ్.. చక్కువరక్కళ్ యూత్ ఫ్రంట్ అధ్యక్షునిగా పోలీసులు గుర్తించారు.