అయోధ్యలో మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ధన్నీపుర్లోని ఆ స్థలం తమదే అంటూ దిల్లీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెల్లు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫిబ్రవరి 8న లక్నో బెంచ్ దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
పిటిషనర్ల వాదన
1947లో దేశవిభజన జరిగినప్పుడు తమ తండ్రి పంజాబ్ నుంచి వచ్చి ఫైజాబాద్(ప్రస్తుతం అయోధ్య) జిల్లాలో స్థిరపడ్డారని పిటిషనర్లు రాణీ కపూర్ అలియాస్ రాణి బలుజా, రమారాణి పంజాబీ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయనకు ధన్నీపుర్ గ్రామంలో 28 ఎకరాల స్థలాన్ని నాజుల్ శాఖ కేటాయించిందని తెలిపారు. ఐదేళ్ల కాలానికి ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత కూడా అది తన అధీనంలోనే ఉందని వెల్లడించారు. అనంతరం తమ తండ్రి పేరు రెవెన్యూ రికార్డుల్లోనూ చేర్చారని చెప్పారు.