Elephants Attack: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో గజరాజులు దాడి చేయడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఈ రోజు ఉదయం పైపాలెము, మోత్లచేను, మల్లానూరు గ్రామాలలోని.. జనావాసాల్లో సంచరిస్తూ ప్రజలను పరుగులు పెట్టించాయి. మల్లానూరు పంచాయతీ పర్తి చేను గ్రామానికి చెందిన ఉష (42) కాలినడకన రైల్వేస్టేషన్‌కు వెళుతుంటే రెండు ఏనుగులు ఆమెపై దాడి చేశాయి. ఈ దాడిలో ఉష మృతి చెందింది.
సప్పానికుంట గ్రామానికి చెందిన రైతు శివలింగం (70) పొలం నుంచి ఇంటికి వెళుతుండగా.. ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో శివలింగం మృతి చెందారు. వారం రోజుల కిందట తమిళనాడులో పెరుమాల్ అనే రైతును బలిగొన్న జంట ఏనుగులను.. అక్కడి అటవీ సిబ్బంది కుప్పం వైపు మళ్లించారు.
గురువారం ఉదయం నుంచి కుప్పం మండలంలో సంచరిస్తున్న ఆ జంట ఏనుగులు.. తాజాగా ఇద్దరిని బలిగొన్నాయి. ఏనుగుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఏనుగుల నుంచి రక్షణను కల్పించేందుకు.. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏనుగులు జనాన్ని భయపెట్టి పరుగులు పెట్టిస్తున్నాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఏనుగులను అక్కడి నుంచి పొలాల్లోకి తరిమారు. ఘటనా స్థలిలో ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.