Tamil nadu Police Encounter : తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో కాల్పులు కలకలం రేపాయి. గుడువంచేరీ వద్ద పోలీసుల కాల్పుల్లో ఇద్దరు రౌడీ షీటర్లు మృతి చెందారు. మరో ఇద్దరు ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక ఎస్ఐ గాయపడ్డారని పేర్కొన్నారు. మృతులు పలు హత్య కేసుల్లో నిందితులని వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాంబరం పోలీస్ స్టేషన్ పరిధిలో గుడువంచేరీలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఇన్స్పెక్టర్ మురుగేషన్ నేతృత్వంలోని పోలీసులు పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. తనిఖీ నిమిత్తం ఒక నల్ల రంగు స్కోడా ఎస్‌యూవీ కారును ఆపేందుకు ప్రయత్నించారు. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు తమ వాహనాన్ని ఆపకపోగా.. పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టారు. అంతే కాకుండా వేట కొడవళ్లతో పోలీసులపై దాడి చేశారు. వారి దగ్గరున్న బాంబును పోలీసులపైకి విసిరారు. అయితే, నిందితులు దాడి చేయడం వల్ల.. పోలీసులు వారిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని.. వారిని వెంటనే దగ్గల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. అనంతరం నిందితులిద్దరూ మరణించినట్లు తెలిపారు.