Two more arrested in TSPSC Paper leak case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. వరుస అరెస్టులు చేస్తూ.. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో తీగ లాగితే డొంకంతా కదిలినట్లు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాకుండా ఈ లీకేజీ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు పేపర్లు ఎవరెవరి చేతుల్లోకి వెళ్లాయనే దానిపై దృష్టి సారించారు.
TSPSC paper leak case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ - TSPSC పేపర్ లీక్ కేసు లేటెస్ట్ అప్డేట్స్
12:15 April 21
TSPSC పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్టు
Father and son arrested in TSPSC Paper leak case : ఈ క్రమంలోనే ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, డాక్యా నాయక్‌లు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న చాలా మందికి ఈ ప్రశ్నపత్రాలు విక్రయించినట్లు తెలిసిందని సిట్ అధికారులు తెలిపారు. అంతేకాకుండా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కూడా క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేశారని వెల్లడించారు.
SIT inquiry in TSPSC Paper leak case : ఈ క్రమంలోనే పేపర్ లీక్ వ్యవహారంలో తాజాగా సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన తండ్రీకుమారులు మైబయ్య, జనార్ధన్‌ను అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. కుమారుడి కోసం మైబయ్య రూ.2 లక్షలతో ఏఈ పేపర్ కొన్నాడని వెల్లడించారు. డాక్యాకు రూ.2 లక్షలు ఇచ్చి పేపర్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే పేపర్ లీక్ కేసులో 19 మంది అరెస్టయిన విషయం తెలిసిందే.
"మైబయ్య వికారాబాద్ ఎంపీడీవో ఆఫీసులో టెక్నికల్ సహాయకుడిగా పని చేస్తున్నాడు. ఈ కేసులో మరో నిందితురాలైన రేణుక భర్త డాక్యా నాయక్‌తో మైబయ్యకు పరిచయం అయింది. ఈ క్రమంలోనే మైబయ్య కుమారుడు జనార్ధన్ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లు తెలుసుకున్నాడు డాక్యా. టీఎస్పీఎస్సీ సిబ్బందితో తనకు పరిచయాలున్నాయని.. కొంత డబ్బు ముట్టజెబితే పరీక్ష ప్రశ్నపత్రాలు తీసుకొచ్చి ఇస్తానని నమ్మబలికాడు. అంతే కాకుండా ఏఈ క్వశ్చన్ పేపర్‌ను రూ.6 లక్షలకు బేరం పెట్టాడు. మైబయ్య రూ.2 లక్షల వరకు అయితే చెల్లించుకోగలుగుతానని చెప్పాడు. దానికి ఒప్పుకున్న డాక్యా.. మైబయ్య తన ఖాతాకు డబ్బు బదిలీ చేసిన తర్వాత ఏఈ ప్రశ్నపత్రాన్ని అందించాడు. వెంటనే మైబయ్య తన కుమారుడికి ఆ పత్రాని ఇచ్చి పరీక్ష రాయించాడు." - సిట్ అధికారులు