Secunderabad Gold Robbery Case : ఈ నెల 27న సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలోని బంగారం దుకాణంలో చోరీ కేసును పోలీసులు చేధించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. మంగళవారం పుణెలో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను చేపట్టాయి. వీరి వద్ద నుంచి ఇప్పటివరకు 1,100 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Secunderabad Gold Theft Case Updates : సికింద్రాబాద్‌లోని బంగారం దుకాణంలో ఐటీ అధికారుల పేరుతో సినీ ఫక్కీలో ఓ ముఠా భారీ చోరీకి పాల్పడింది. మే 27వ తేదీన ప్యాట్ మార్కెట్లోని బాలాజీ జ్యువెల్లరీ షాపులో ఐటీ అధికారులమని అక్కడ ఉన్న వారిని నమ్మించి.. ఐదుగురు వ్యక్తులు 1700 గ్రాముల బంగారంతో ఉడాయించారు.
షాపు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో 36 గంటల్లోనే ముఠాలోని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. దుండగులు చోరీ చేసిన అనంతరం.. జేబీఎస్ వరకు ఆటోలో వెళ్లి.. ఆ తర్వాత కేపీహెచ్‌బీ బస్ స్టాండ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి మహారాష్ట్ర బస్సు ఎక్కి చేక్కేశారు. ఈ సమాచారం ఆధారంగా బస్సు రూట్ ప్రకారం.. మూడు బృందాలు అక్కడకు చేరుకున్నాయి. మహారాష్ట్రలో లోకల్ పోలీసుల సహాయంతో నలుగురిని అరెస్టు చేసి.. సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకువచ్చారు.