Minor girls gang raped: మొబైల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూసి చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన ఘటన బిహార్లో జరిగింది. షేక్పుర జిల్లాలోని బార్బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు నుంచి ఆరుగురు టీనేజర్లు.. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు.
బాలికలు పొలం పనికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత బాలికలిద్దరూ తమ ఇళ్లకు వెళ్లారని చెప్పారు. అందులో ఒకరి ఆరోగ్యం క్షీణించిందని, కుటుంబ సభ్యులు అడిగేసరికి బాలిక విషయం చెప్పిందని వివరించారు. అనంతరం, బాధిత కుటుంబ సభ్యులు బాలుడి కుటుంబీకులతో గొడవకు దిగారని చెప్పారు.
"బాలికల నాయనమ్మ ఈ విషయంపై తమకు సమాచారం అందించింది. వెంటనే దీనిపై చర్యలు తీసుకున్నాం. నిందితులిద్దరినీ పట్టుకున్నాం. విచారణలో ఇద్దరూ నేరం అంగీకరించారు. మొబైల్లో వీడియోలు చూసి ఇలా చేసినట్లు చెప్పారు. బాధిత బాలికలను మహిళా పోలీసులు విచారించారు. ఐదారుగురు కలిసి తమపై ఈ దారుణానికి పాల్పడ్డారని బాలికలు చెప్పారు. ఈ సమయంలో ఇద్దరూ ఏడవడాన్ని చూసి.. నిందితులు చెరో ఐదు రూపాయలు ఇచ్చారు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు."