Modi JK visit security: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలోని మిర్హమ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. పోలీసులు, ఆర్మీ జవాన్లు.. ముష్కరుల ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధాని పర్యటనకు ముందు ఉగ్రమూకలు దాడులకు పాల్పడుతున్నందున అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించిన భద్రతా దళాలు.. రహదారుల వద్ద వేల సంఖ్యలో సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాయి. సమస్యాత్మక ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్ముకశ్మీర్‌లో ఆదివారం పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇందుకోసం లక్ష మందికి సరిపడేలా సభ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. 30 వేల మందికి పైగా వివిధ పంచాయతీల సభ్యులు ఇందుకు హాజరుకానున్నట్లు సమాచారం.
మరోవైపు, ఎన్ఐఏ చీఫ్, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ శనివారం.. జమ్ములోని సుంజ్వాన్ ప్రాంతంలో పర్యటించారు. జమ్ము సెక్టార్ సీఆర్పీఎఫ్ ఐజీ పీఎస్ రాన్పీసే సైతం ఆయన వెంట ఉన్నారు. జైషే మహమ్మద్ ముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్లను భద్రతా బలగాలు శుక్రవారం ఇక్కడే మట్టుబెట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కుల్దీప్కు అధికారులు వివరించారు. మోదీ బహిరంగ సభ జరిగే పాలి పంచాయత్‌ను సైతం సందర్శించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
కాగా, పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సరిహద్దుల్లో పొంచి ఉన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. 80-100 మంది ఉగ్రవాదులు లాంచ్ ప్యాడ్ల వద్ద సిద్ధంగా ఉన్నారని తెలిపాయి. వీరంతా అఫ్గానిస్థాన్‌లో శిక్షణ పొందారని నిఘా అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించేందుకు ఉపయోగించే లాంచ్ ప్యాడ్లు తిరిగి క్రియాశీలంగా మారినట్లు పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రపైనా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. 43 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. రెండేళ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర జరగనుండటం గమనార్హం. అయితే, ఉగ్రవాదుల దాడులను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు భద్రతా దళాలు స్పష్టం చేశాయి. 'అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకున్నాం' అని సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ తెలిపారు.