అసోం కరీమ్గంజ్ జిల్లాలోని నీలంబజార్‌లో దారుణం జరిగింది. ఇద్దరు యువతులపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిద్దరూ సిల్చార్ మెడికల్ కాలేజీ నుంచి అద్దె కారులో త్రిపురకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సిల్చార్ కళాశాలలో చికిత్స పొందుతున్న తల్లిని చూసేందుకు వారిద్దరూ వెళ్లారు. అనంతరం ఓ అద్దె కారులో అక్కడి నుంచి బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో కారును దారి మళ్లించి నీలంబజార్ ప్రాంతంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లాడు డ్రైవర్. మరో ఐదుగురితో కలిసి ఇద్దరు యువతులపై అత్యాచారానికి ఒడిగట్టారు.
ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న బాధితురాళ్లు... బజారిసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలం నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అబ్దుల్ అహాద్గా గుర్తించిన అధికారులు.. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
మహారాష్ట్రలో దారుణం..
మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో ఓ పాఠశాల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఫేస్బుక్లో పరిచయమైన భూషణ్ మాడియే అనే వ్యక్తే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ నెల 12న కలవాలంటూ ఫోన్ చేసి బాలికను పిలిపించాడు. అనంతరం లాడ్జ్‌కు తీసుకెళ్లి తన స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని రికార్డు చేసి... విషయాన్ని ఎవరికైనా చెప్తే, వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామని ఆ బాలికను బెదిరించాడు. అయితే బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.