Two Friends Begging For Stray Dogs And Cats :వీధుల్లో తిరిగే కుక్కలు, పిల్లుల బాగోగుల కోసం రోడ్డెక్కారు బంగాల్ కోల్‌కతాకు చెందిన ఇద్దరు స్నేహితులు. వాటి తిండి, ఆరోగ్యం సహా ఇతర అవసరాలు తీరేందుకు కావాల్సిన డబ్బు కోసం యాచిస్తున్నారు. అలా వచ్చిన సాయాన్ని వాటి యోగక్షేమాల కోసం వినియోగిస్తున్నారు.
మధురీతు దే, అనురభ్ రాయ్- ఇద్దరు స్నేహితులు. అనురభ్ రాయ్ డిగ్రీ పూర్తి చేసి పలు ఐటీ కంపెనీల్లో పనిచేసి మానేశారు. మధురీతు దే కూడా కోల్‌కతాలోని ఒక ప్రముఖ పబ్లిషింగ్ హౌస్‌లో 6 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగాన్ని వదిలేశారు. వీరిద్దరికీ టూరిజం రంగం అంటే ఎంతో ఇష్టం. ఇందులో భాగంగానే కొన్నాళ్ల తర్వాత ఇద్దరు కలిసి ఓ ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి దానిని నిర్వహిస్తున్నారు. అలా పర్యాటకంపై ప్రేమతో అప్పుడప్పుడు అడవుల్లో, కొండ మార్గాల్లో బైక్ రైడ్లకూ వెళ్తుంటారు.
ప్లకార్డు, డొనేషన్ బాక్స్‌తో రోడ్లపైకి
ఇదిలాఉంటే ఈ ఇద్దరు మిత్రులకు మూగజీవాలంటే ప్రాణం. ఈ కారణంతోనే వాటికోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. అదే- వీధి కుక్కలు, పిల్లుల సంరక్షణ. ఇందులో భాగంగానే వీధుల వెంట, రోడ్లపై తిరిగే కుక్కలు, పిల్లులకు కావాల్సిన ఆహారమే కాకుండా వాటికి అనారోగ్యం తలెత్తితే ఆస్పత్రిలో చూపించేందుకు అవసరమయ్యే నగదును పోగు చేయాలనుకున్నారు. ఇందుకోసం కోల్‌కతా నగర రోడ్లపై, కూడళ్లల్లో నిలబడి ప్రజల వద్ద భిక్షాటన చేస్తున్నారు. అలా కొందరు ఇచ్చే ఎంతోకొంత డబ్బుతో వివిధ ప్రాంతాల్లో ఆపదలో ఉన్న అనేక మూగజీవాలను ఆదుకుంటున్నారు. వాటికి సేవ చేసుకుంటున్నారు. తాము యాచించేందుకు గల కారణాలను వివరిస్తూ ఓ ప్లకార్డుతో పాటు చిన్నపాటి డొనేషన్ బాక్స్‌ను పట్టుకొని తిరుగుతున్నారు. ఇలా వారంలో కొన్ని రోజులు భిక్షాటన చేస్తున్నారు మధురీతు దే, అనురభ్ రాయ్.