మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనాకు చెందిన రెండు(ఎన్440కే, 484కే) వేరియంట్లు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. తెలంగాణలోనూ ఈ వేరియంట్లు ఉన్నట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 187 మందిలో యూకే స్ట్రెయిన్ బయటపడినట్లు వెల్లడించిన మంత్రిత్వశాఖ.. ఆరుగురిలో దక్షిణాఫ్రికా స్ట్రెయిన్, ఒకరిలో బ్రెజిల్ స్ట్రెయిన్ గుర్తించినట్లు తెలిపింది. అయితే కేసులు పెరుగుదలకు అవే కారణంగా చెప్పలేమని స్పష్టం చేసింది.
దేశంలో కరోనా టీకాల పంపిణీ శరవేగంగా సాగుతోందన్న ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 1,17,54,788 టీకా డోసులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వీటిల్లో 1,04,93,205 మొదటి టీకా డోసులు కాగా.. 12,61,583 రెండో టీకా డోసులు ఉన్నాయని పేర్కొన్నారు.
కర్ణాటక, తెలంగాణ, దిల్లీ, పంజాబ్ సహా 11 రాష్ట్రాల్లో 60శాతం కంటే తక్కువ మంది వైద్య సిబ్బందికి తొలి టీకా డోసు అందించామన్నారు రాజేశ్. రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా 12 రాష్ట్రాల్లో 75 శాతం మందికిపైగా వైద్య సిబ్బందికి మొదటి డోసు టీకా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.