అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులకు గ్రామస్థులు నిప్పటించారు. నిందితులను ఆస్పత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇందుకు కారణమైన వారిపై తగిన చర్యలు చేపడతామని వెల్లడించారు.
యువతిపై దాడి..: లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. బ్యాగ్, మొబైల్ లాక్కునేందుకు ప్రయత్నించగా బాధితురాలు ప్రతిఘటించడం వల్ల ఈ చర్యకు పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం ముంబయిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పప్పూగుప్తాగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం: మహిళల కోసం కేటాయించిన కోచ్‌లో ఒంటరిగా బాధితురాలు ప్రయాణిస్తుండగా.. పప్పూ గుప్తా కంపార్ట్మెంట్లోకి వచ్చి యువతి పక్కన కుర్చున్నాడు. బాధితురాలు అక్కడి నుంచి లేచి డోర్ దగ్గర నిలబడింది. చుర్నీ రోడ్ స్టేషన్ దాటగానే.. నిందితుడు ఆమె బ్యాగ్, మొబైల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాధితురాలు ప్రతిఘటించగా.. ఆమె జుట్టు పట్టుకుని పెదాలను కొరికాడు. ఆ తర్వాత ఆమె బ్యాగ్, ఫోన్లను లాక్కున్నాడు. బాధితురాలు సాయం కోసం అరిచేసరికి నిందితుడు ఛైర్చ్గేట్ స్టేషన్ వద్ద రైలు నుంచి దూకి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.