Tamilnadu encounter news: తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలో ఇద్దరు యువకులను హత్య చేసిన సంచలన ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో పోలీసులపై గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారని, ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
ఏం జరిగింది?
చెంగల్పట్టు జిల్లా కేంద్రానికి చెందిన అప్పు అలియాస్ కార్తిక్.. గురువారం టీ షాప్‌కు వెళ్లాడు. ఆ సమయంలో కార్తిక్‌ను ముగ్గురు దుండగులు ద్విచక్రవాహనంపై వెంబడించారు. కొద్ది దూరం వెళ్లగానే కార్తిక్‌పై గ్రెనేడ్ దాడి చేశారు. కిందపడిపోగా.. కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఆ తర్వాత.. అదే గ్యాంగ్ మరో హత్య చేసింది. చెంగల్పట్టుకు చెందిన కూరగాయల వ్యాపారి శ్రీనివాస్ కుమారుడు మహేశ్‌ను పొట్టనపెట్టుకుంది. ఇంట్లో ఒక్కడే టీవీ చూస్తుండగా చొరబడి కాల్చి చంపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకున్నారు. మృతుదేహాలను శవపరీక్ష కోసం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పట్టపగలు, అత్యంత రద్దీ ప్రాంతాల్లో రెండు హత్యలు జరగటంపై కలకలం సృష్టించింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంగల్పట్టులో గ్యాంగ్ హింస పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో దినేశ్, మొహిదీన్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్లు సమాచారం అందింది. ఆ వెంటనే వారిని పట్టుకునేందుకు అడవికి వెళ్లారు పోలీసులు. అదే సమయంలో పోలీసులపై గ్రెనేడ్ దాడి చేశారు దినేశ్, మొహిదీన్. తప్పించుకునేందుకు యత్నించారు. దీంతో వారిని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఈ హత్యలకు సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి:జ్యోతిష్యాన్ని నమ్మి కుమార్తెను హత్య చేసిన తల్లి.. ఆపై ఆత్మహత్య
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- ముగ్గురు ముష్కరులు హతం