కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాతాను పునరుద్ధరించింది ట్విట్టర్. దిల్లీలో హత్యాచారానికి గురైన ఒక దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆ చిత్రాలను పంచుకున్నందుకు ఆయన ఖాతాను ట్విట్టర్ గతవారం తాత్కాలికంగా స్తంభింపజేసింది. నిబంధనలను ఉల్లంఘించినందుకే రాహుల్ ఖాతాను బ్లాక్ చేసినట్లు సంస్థ తెలిపింది.
తాజాగా ఆయన ఖాతాను ట్విట్టర్ అన్‌లాక్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. రాహుల్‌తో పాటు మరికొందరు పార్టీ నేతల ఖాతాలను కూడా పునరుద్ధరించినట్లు తెలిపింది.
తన ఖాతాను నిలిపివేయడంపై రాహుల్ గాంధీ శుక్రవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని, దేశ రాజకీయ ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. మన రాజకీయాలపై ఆ కంపెనీ వ్యాపారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. ఈ మేరకు యూట్యూబ్ వేదికగా ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు.