నూతన ఐటీ నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తుది వార్నింగ్ అనంతరం ట్విట్టర్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను పాటించేందుకు సిద్ధమేనని.. అయితే, వాటి అమలుకు మరికొంత సమయం కావాలని కోరినట్లు సమాచారం. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఐటీ చట్టాల అమలుకు కొంత సమయం కావాలని ట్విట్టర్ యాజమాన్యం కోరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
నూతన ఐటీ నిబంధనలను తక్షణమే అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌కు రెండు రోజుల క్రితం తుది నోటీసులు ఇచ్చింది. వీటిని అమలు చేయకపోతే ఐటీ చట్టం కింద లభించే మినహాయింపులను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నిబంధనల అమలులో ట్విట్టర్ వ్యవహారం సరిగ్గా లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ వ్యాఖ్యానించింది. గడువు ఇచ్చినప్పటికీ.. నిబంధనలను పాటించడంలో అలసత్వం వహిస్తే పర్యవసానాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించింది.