- మే 26 నుంచి కొత్త ఐటీ నిబంధనలు అమలు- పాటించని ట్విట్టర్
- జూన్ 16న ట్విట్టర్‌కు కేంద్రం షాక్- మధ్యవర్తిత్వ వేదిక హోదా కోల్పోయినట్లు ప్రకటన
- కొత్త ఐటీ రూల్స్‌పై కోర్టుల్లో కేసులు- ట్విట్టర్‌కు పార్లమెంటరీ స్థాయీ సంఘం కఠిన ప్రశ్నలు
- కీలక నేతల ఖాతాల బ్లూటిక్ విషయంలో గందరగోళం
- అప్పటి ఐటీ మంత్రి రవిశంకర్‌కు ట్విట్టర్ ఝలక్- గంటపాటు అకౌంట్ బ్లాక్
- భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపించిన ట్విట్టర్- కేంద్రం ఫైర్
- ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్- ఐటీ నిబంధనలకు లోబడి కార్యకలాపాలు
కొంతకాలం క్రితం సాగిన 'కేంద్రం వర్సెస్ ట్విట్టర్' రగడకు సంక్షిప్త రూపమిది. ఈ వివాదాల కథ ఇంకా ముగియలేదు. అయితే పాత్రలు మాత్రం మారాయి. అధికార పక్షం స్థానంలో ఇప్పుడు విపక్షం వచ్చింది. కాంగ్రెస్ వర్సెస్ ట్విట్టర్.. రాజకీయంగా చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్-ట్విట్టర్ గొడవేంటి?
గత వారం మొదలైందీ రగడ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అకౌంట్‌ను ట్విట్టర్ బ్లాక్చేయడం వివాదానికి ఆజ్యం పోసింది.
దిల్లీలో ఇటీవల ఓ 9 ఏళ్ల బాలిక హత్యాచారానికిగురైంది. ఆమె ఇంటికెళ్లి, కుటుంబసభ్యుల్ని కలిసిన రాహుల్.. సంబంధిత ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. చట్ట ప్రకారం అత్యాచార బాధితులు, వారి సంబంధీకుల ఫొటోలు, ఇతర వివరాల్ని బహిర్గతం చేయడం నిషేధం. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం(ఎన్సీపీసీఆర్) ఇదే విషయంపై స్పందించింది. నిబంధనలు ఉల్లంఘించిన రాహుల్ ఖాతాపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌ను ఆదేశించింది. అందుకు అనుగుణంగా అకౌంట్ బ్లాక్ చేసింది ట్విట్టర్.
వారంలోనే మరో భారీ షాక్
రాహుల్ ఖాతాను బ్లాక్ చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భావప్రకటన స్వేచ్ఛను ట్విట్టర్ హరిస్తోందని మండిపడింది. కాంగ్రెస్ నేతలంతా రాహుల్‌కు సంఘీభావం ప్రకటించారు. తమ సొంత ట్విట్టర్ ఖాతాల పేర్లను 'రాహుల్ గాంధీ'గా మార్చారు. ప్రొఫైల్ పిక్గానూ తమ యువ నేత ఫొటో పెట్టారు.
ఈ వివాదం సద్దుమణగకముందే కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఏకంగా పార్టీ అధికారిక ఖాతా బ్లాక్ అయింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు రణ్‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్ సహా మొత్తం 5 వేల మంది కీలక నేతల అకౌంట్లదీ ఇదే పరిస్థితి అని ఆరోపించింది కాంగ్రెస్.
"కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగా ట్విట్టర్ విపక్ష నేతల ఖాతాలను బ్లాక్ చేస్తోంది. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ ఇలాంటి ఫొటోలే(రాహుల్ షేర్ చేసిన ఫొటో వంటివి) షేర్ చేసింది. కొద్దిరోజులు అవి అలానే ఉన్నాయి. అయినా ఆ ఖాతాపై ట్విట్టర్ చర్యలు తీసుకోలేదు. దీనిబట్టి ప్రభుత్వ ఒత్తిడే కారణమన్నది సుస్పష్టం."
-రోహన్ గుప్తా, కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం సారథి
"పోలీసులను అడ్డంపెట్టుకుని కేంద్రంలోని పెద్దలు ట్విట్టర్‌ను ఎంత బెదిరిస్తారు? ఇది భావ ప్రకటన స్వేచ్ఛ మాత్రమే కాదు. పేద, దళిత బాలికకు న్యాయం కోసం గళం విప్పడానికి సంబంధించిన అంశం. ఆ పేద బాలికకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. మోదీ ప్రభుత్వం పిరికిపందలా ట్విట్టర్‌ను బెదిరించి మా వాణిని అణిచివేయలేదు."
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి