తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.20కోట్ల గోల్డ్ దోపిడీకి స్కెచ్, అడ్డంగా దొరికి సస్పెండ్ అయిన పోలీస్

ఓ ఆభరణాల రుణ సంస్థ ఆఫీసులోకి చొరబడిన దుండగులు సిబ్బందిని బెదిరించి రూ.20 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. అయితే ఈ దోపిడీ వెనుక స్థానిక ఇన్​స్పెక్టర్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

nbfc robbery
Etv Bharat

By

Published : Aug 19, 2022, 4:23 PM IST

Bank Robbery Chennai: తమిళనాడు రాజధాని చెన్నైలో గతవారం ఓ ఆభరణాల రుణ సంస్థలో భారీ దోపిడీ జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే సంస్థ ఆఫీసులోకి చొరబడిన దుండగులు సిబ్బందిని బెదిరించి రూ.20 కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. అయితే ఈ కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. దోపిడీ చేసిన నగల్లో కొన్ని స్థానిక ఇన్‌స్పెక్టర్‌ అమల్​రాజ్​ ఇంట్లో లభించడం కలకలం రేపుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ ఇంటి నుంచి 3.7 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సహకరించిన పోలీస్ ఇన్​స్పెక్టర్ అమల్​రాజ్​ను సస్పెండ్ చేశారు అధికారులు. నిందితుడు సంతోష్​కు అమల్​రాజ్ బంధువని పోలీసుల విచారణలో తేలింది.

అసలేం జరిగిందంటే..
నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెన్నైలోని అరుంబాక్కంలో ఓ బ్రాంచ్‌ ఉంది. ఆగస్టు 13న మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ బ్రాంచీలోకి కొందరు దుండగులు చొరబడ్డారు. సిబ్బంది, కస్టమర్లను కత్తులతో బెదిరించి తాళ్లతో కట్టేశారు. ఆపై రూ.20కోట్ల విలువైన నగలు, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఫెడ్‌బ్యాంకులో పనిచేసే వ్యక్తులే దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రధాన నిందితుడిగా మురుగున్‌ అనే వ్యక్తి ఉన్నట్లు అనుమానించారు. నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.

ఘటన జరిగిన మరుసటి రోజే సంతోష్‌, బాలాజీ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.8.5కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రోజు మురుగున్‌, మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అయితే విచారణలో నిందితుడు సంతోష్‌ కీలక సమాచారమిచ్చాడు. తాను దోచుకున్న నగల్లో కొన్నింటిని అచరపాక్కమ్‌ ఇన్‌స్పెక్టర్‌ అమల్‌రాజ్‌ ఇంట్లో దాచిపెట్టినట్లు తెలిపాడు. అంతేగాక, నిందితుడు సంతోష్‌.. అమల్‌రాజ్‌ భార్యకు బంధువు కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. గురువారం ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో సోదాలు జరపగా 3.7కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో అమల్‌రాజ్‌, ఆయన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ దోపిడీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇన్‌స్పెక్టర్‌ చెబుతున్నారు. ఘటన జరిగిన రాత్రి సంతోష్‌ తమ ఇంటికి వచ్చాడని, అతడి వద్ద బంగారం ఉన్నట్లు తమకు తెలియదన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసిన పోలీసులు ఇన్​స్పెక్ట్​ర్ అమల్​రాజ్​ను సస్పెండ్ చేశారు.

ఇవీ చదవండి:బాయ్​ఫ్రెండ్​తో గొడవ, మద్యం సేవించి చేయి కోసుకున్న యువతి

బిర్యానీ బిల్లు విషయంలో గొడవ, కత్తితో దారుణంగా పొడిచి

ABOUT THE AUTHOR

...view details