ఉన్నత చదువులతో వ్యాపారవేత్తగా రాణించాలని కలల కన్న కుర్రాడు అతను. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులతో పుస్తకాలనే పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్‌గా మారాడు తమిళనాడు చెన్నైకి చెందిన అన్నా దురై. అయితేనేం? తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కాంక్షించాడు. తన ఆటోను.. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దాలనుకున్నాడు.
ఆటోలో ఐప్యాడ్..
ఆ లక్ష్యంతోనే తన పొదుపులతో న్యూస్ పేపర్లు, మేగజైన్లు, టీవీ, ఐప్యాడ్, ఛార్జింగ్ పాయింట్, కార్డు స్వైపింగ్ యంత్రం ఆటోలో ఏర్పాటు చేశాడు దురై.
ఫ్రిడ్జ్ కూడా..
కరోనా వేళ భద్రత కోసం మాస్కులు, శానిటైజర్ పెట్టాడు. కస్టమర్లు కూల్ కూల్‌గా ఉండేందుకు.. చిన్న ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసి, అందులో ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాడు. దీంతో ఎంతో మంది కస్టమర్లు అతడి ఆటో ఎక్కడానికి ఇష్టపడుతుంటారు. అతడిని ఆటో అన్నా అని కూడా పిలుచుకుంటారు.
ఆటోలో టీవీ, ఫ్రిడ్జ్, ఛార్జింగ్ పాయింట్
గుర్తింపు ప్రత్యేకతతోనే..
ఉన్న పరిస్థితిని చూసి నిందించుకోవడం చాలా మందికి అలవాటు. కానీ.. ఆటో డ్రైవర్‌గా ఉన్నా, మనకంటూ ప్రత్యేకత ఎలా సంపాదించుకోవాలో చేసి చూపిస్తున్నాడు దురై. ఒక్కొక్క వినియోగదారుడిని ఒక్కో భాషలో 'హలో' అని పలకరించగలడు. అలా మొత్తం 9 భాషలు నేర్చేసుకున్నాడు. కస్టమర్లతో స్నేహం చేస్తాడు. ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాడు.
చదువుపై ఉన్న ఇష్టం కారణంగా.. ఇక ఉపాధ్యాయులకైతే ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాడు దురై.
స్ఫూర్తినిస్తూ..
ఈ ఆటో అన్నకు సొంతంగా ఓ యాప్ కూడా ఉంది. 'నిన్ను నువ్వు పరిచయం చేసుకునే అవసరం రానంతవరకు పనిచేస్తూనే ఉండు' అనేది ఇతడి ఫిలాసఫీ. కలలకు చదువు, లక్ష్యాలకు పరిస్థితులు అడ్డుకావని నిరూపిస్తున్న దురై.. టెడ్ఎక్స్ ప్రసంగాలతోనూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నాడు.
ఇదీ చూడండి:ఆటో రిక్షాతో 'మొబైల్ హౌస్'.. మహీంద్రా ఫిదా