పుదుచ్చేరి రాజ్‌నివాస్(గవర్నర్ ఉండే చోటు)కు, సీఎం కార్యాలయానికి మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది. అధికార విబేధాలు, కోర్టు గొడవలు, విధానపరమైన నిర్ణయాల్లో అనిశ్చితులు.. వీటన్నింటికీ ముగింపు లభించింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని ఆ పదవిలో నుంచి తొలగించడమే ఇందుకు కారణం.
2016 మే 29న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు కిరణ్ బేడీ. అప్పటి నుంచి ఆ స్థానంలో క్రియాశీలంగా పనిచేశారు. రాజ్‌నివాస్‌ను ప్రజలకు దగ్గర చేసేందుకు యత్నించారు. ఫిర్యాదు పరిష్కార సమావేశాల పేరిట.. పౌరుల సమస్యలు తీర్చడం వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... లెఫ్టినెంట్ గవర్నర్ చేపడుతున్న ఈ కార్యక్రమాలపై పెదవి విరిచింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సమాంతరంగా మరో సర్కారును బేడీ నడిపిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. అది మొదలు.. కిరణ్ బేడీ తొలగింపు వరకు.. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య తలెత్తిన విబేధాలకు అంతులేదు.
ఇదీ చదవండి:సీఎం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మధ్య మాటల యుద్ధం
వరుస వివాదాలు...
వాట్సాప్‌లో అసభ్యకరమైన వీడియో షేర్ చేసినందుకు 2017 జనవరిలో పుదుచ్చేరి సివిల్ సర్వీసు అధికారిని లెఫ్టినెంట్ గవర్నర్ బేడీ సస్పెండ్ చేశారు. సదరు అధికారిపై విచారణ ప్రారంభించాలని పోలీసులను ఆదేశించారు. ఈ సమయంలోనే తొలిసారి బేడీ లక్ష్యంగా కాంగ్రెస్ బహిరంగంగా విమర్శలు చేసింది. తన అధికార పరిధిని దాటి ప్రవర్తించారని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే అధికారిక సంప్రదింపుల కోసం ఉన్నత ఉద్యోగులు సోషల్ మీడియాను ఉపయోగించడంపై నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులను బేడీ రద్దు చేయడం నారాయణసామి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు ఆగ్రహం తెప్పించింది.
ఇదీ చదవండి:"కిరణ్ బేడీని వెనక్కు పిలవాల్సిందే"
ఆ తర్వాత నుంచి ప్రభుత్వం తీసుకునే సాధారణ నిర్ణయాలపైనా ప్రతిష్టంభన ఏర్పడుతూ వచ్చింది. బీచ్‌లో కొత్త సంవత్సర సంబరాలు జరుపుకునేందుకు అనుమతించే విషయంపైనా విబేధాలు తలెత్తాయి. చిన్న చిన్న అంశాలపై ఎదురవుతున్న అడ్డంకులపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది పుదుచ్చేరి కాంగ్రెస్ సర్కార్. బేడీ నియంతృత్వ పోకడలతో, అనైతికంగా వ్యవహరిస్తున్నారని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ సమర్పించారు.
ఇదీ చదవండి:పుదుచ్చేరి సీఎంకు సుప్రీంకోర్టు నోటీసులు
అనంతరం, పుదుచ్చేరి అసెంబ్లీలో నామినేటెడ్ పదవులపైనా వివాదం నెలకొంది. అసెంబ్లీలో ఉన్న మూడు నామినేటెడ్ స్థానాలకు ముగ్గురు భాజపా నేతల పేర్లను కేంద్రం ఖరారు చేసింది. వీరి నియామకాన్ని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది పుదుచ్చేరి సర్కార్. వారికి అసెంబ్లీలోకి అనుమతి నిరాకరించింది. ఈ సభ్యులతో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రమాణస్వీకారం చేయించడం.. విబేధాలకు మరింత ఆజ్యం పోసింది.