Tushar Gandhi Detained By Police : జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీని అదుపులోకి తీసుకున్నారు శాంతాక్రూజ్ పోలీసులు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఆగస్టు క్రాంతి మైదానంలో జరిగే శాంతియుత యాత్రలో పాల్గొనేందుకు తుషార్ గాంధీ, ఆయన మద్దతుదారుడు జీ.పరేఖ్ బుధవారం బయలుదేరారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున తుషార్ గాంధీ, జీ.పరేఖ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి..
స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి తనను పోలీసులు నిర్భందించారని తుషార్ గాంధీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి తాను ఇంటి నుంచి బయటికి రాగా.. అంతలోనే శాంతాక్రూజ్ అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా శాంతి యాత్ర చేపడదామకున్నానని అన్నారు. 'మహాత్మా గాంధీ ఈ చరిత్రాత్మక తేదీన(ఆగస్టు 9) ఆంగ్లేయుల చేతిలో అరెస్ట్ అయ్యారు. నేను కూడా అదే తేదీన పోలీసులు అదుపులో ఉన్నా. అందుకు నేను గర్వపడుతున్నా. తాను పోలీసుల అదుపులోకి నుంచి బయటకు రాగానే ఆగస్టు క్రాంతి మైదానంలో జరిగే ర్యాలీకి హాజరవుతాను.' అని తుషార్ గాంధీ తెలిపారు.
సంజయ్ రౌత్ ఫైర్..
మరోవైపు.. తుషార్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. తుషార్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొననని వారు(బీజేపీ నేతలను ఉద్దేశించి).. క్విట్ ఇండియా డే రోజు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేస్తున్నారని విమర్శించారు. దీనిని పెద్ద జోక్‌గా రౌత్ అభివర్ణించారు.