Tunnel Collapse In Uttarakhand : ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలిన ఘటనలో కూలీలంతా క్షేమంగా ఉన్నారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి రంజిత్ కుమార్ సిన్హా తెలిపారు. ఆయన సోమవారం ఘటనాస్థలికి చేరుకుని.. సొరంగాన్ని పరిశీలించారు. సొరంగం లోపల ఉన్న కార్మికులంతా సురక్షితంగా ఉన్నారని.. వారికి ఆహారం, నీరు, ఆక్సిజన్‌ను పైపు ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. దెహ్రాదూన్ నుంచి తెప్పించిన బోరింగ్ యంత్రం ద్వారా రెండున్నర అడుగుల వ్యాసం ఉన్న పైపును అమర్చి.. కార్మికులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. కార్మికులను బయటకు తీసేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.
"మూడు దశల్లో లోపల చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముందుగా సొరంగంలో చిక్కుకున్నవారి కోసం పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్, ఆహార పదార్థాలు, నీటిని అందిస్తున్నాం. జేసీబీ, ఇతర యంత్రాల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నాం."
-- రంజిత్ కుమార్ సిన్హా, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి
'బాధితుల కుటుంబాలను ఆదుకుంటాం'
Uttarakhand Tunnel Accident : మరోవైపు.. ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలిన ఘటనాస్థలిని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సోమవారం సందర్శించారు. శిథిలాల్లో చిక్కుకున్నవారందరినీ రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా జరుగుతోందని.. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శిథిలాల్లో చిక్కుకున్న కూలీలను రక్షించేందుకు కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్ రెస్క్యూ ఆపరేషన్‌పై ఆరా తీస్తున్నారని సీఎం తెలిపారు.