ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. సర్జరీ చేసి ఐదేళ్ల చిన్నారి కడుపులో నుంచి ఏకంగా 12 కిలోల కణితిని తొలగించారు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు ఆనందంలో పొంగిపోయారు. అసలేం జరిగిందంటే..
బులంద్‌షహర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి అనారోగ్య సమస్యలతో అలీగఢ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చిన్నారి పరీక్షించగా.. కడుపులో భారీ కణితి ఉన్నట్లు తేలింది. ఇలా కడుపులో కణితి ఉండడాన్ని వైద్య పరిభాషలో సిస్టిక్ టెరాటోమా అని పిలుస్తారు. పుట్టుకతో వచ్చే సిస్టిక్ టెరాటోమా వయసు పెరుగుతున్నకొద్ది ప్రాణాంతకం కావచ్చని అన్నారు.
చిన్నారికి చిన్నప్పటి నుంచి కడుపులో కణితి ఉందని.. ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియలేదని డాక్టర్ సంజయ్ భార్గవ తెలిపారు. కాలక్రమేణా కణితి క్రమంగా పెద్దదిగా మారి అనారోగ్యానికి దారితీసిందని చెప్పారు. సంజయ్ భార్గవ నేతృత్వంలో నలుగురు వైద్యుల బృందం ఆ చిన్నారికి 4 గంటలపాటు శ్రమించి విజయవంతంగా సర్జరీ పూర్తి చేసింది. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి
"చిన్నప్పటి నుంచి చిన్నారి పొట్ట భాగం పెద్దదిగా ఉంది. బులంద్‌షహర్‌తో పాటు పలు ప్రదేశాల్లో ఉన్న ఆస్పత్రులకు చిన్నారిని చికిత్స నిమిత్తం తరలించాం. అయినా చిన్నారి ఆరోగ్యం కుదుటపడలేదు. స్కానింగ్, వైద్య పరీక్షలు చేయగా చిన్నారిలో కడుపులో భారీ కణితి ఉందని తేలింది. శస్త్రచికిత్స చేసి కణితి తొలగించాలని వైద్యులు చెప్పారు. కానీ ఇంత సంక్లిష్టమైన సర్జరీ చేయడానికి వారు నిరాకరించారు. ఆఖరికి అలీగఢ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చిన్నారిని తీసుకొచ్చాం. ఇక్కడ డాక్టర్ సంజయ్ భార్గవ నేతృత్వంలోని వైద్య బృందం నాలుగు గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్స చేసి.. చిన్నారి ప్రాణాలు కాపాడారు."
-చిన్నారి కుటుంబ సభ్యులు
క్యాన్సర్ రోగి కడుపులో నుంచి కణితి తొలగింపు..
ఈ ఏడాది ఫిబ్రవరిలోఅరుదైన క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ రోగి కడుపులో నుంచి 30 కిలోల కణితిని తొలగించారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి వైద్యులు. దాదాపు ఆరు గంటల పాటు ఈ ఆపరేషన్ కోసం వైద్యులు శ్రమించారు. వారణాసిలోని మహామన పండిట్ మదన్ మోహన్ మాళవియా క్యాన్సర్ సెంటర్లో ఈ ఆపరేషన్ జరిగింది. దేశంలోనే ఇదొక అతిపెద్ద ఆపరేషన్‌గా వైద్యులు చెబుతున్నారు. 55 ఏళ్ల వ్యక్తి కడుపులో ఆ భారీ కణితిని గుర్తించిన వైద్యులు.. అనంతరం ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు.
ఈ కణితి బరువు.. అప్పుడే పుట్టిన 12 మంది పిల్లలతో సమానమని డాక్టర్ మయాంక్ త్రిపాఠి తెలిపారు. ఈ కణితి 34 సెంటీమీటర్ల పొడవు, 46 సెంటీమీటర్ల వెడల్పు ఉందని వెల్లడించారు. ఇది దేశంలోనే అతిపెద్ద కణితి అయిండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తవడం పట్ల పేషెంట్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్క క్లిక్ చెయ్యండి.