SIT Inquiry in TSPSC Paper Leakage Issue : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మూడోరోజు నిందితుల విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో15 ప్రశ్నపత్రాలున్నట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే అందులో.. గ్రూప్-1, ఏఈఈ, డివిజినల్ అకౌంట్స్ అధికారి, ఏఈ పరీక్షలతో పాటు టౌన్ ప్లానింగ్, జూనియర్ లెక్చరర్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలున్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్ వన్ జనరల్ స్టడీస్ పేపర్‌తో పాటు.. ఈ ఏడాది జనవరి 22న నిర్వహించిన ఏఈఈ ఉద్యోగానికి సంబంధించిన పలు ప్రశ్నపత్రాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయి. ఏఈఈ పరీక్షకు సంబంధించి సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ పరీక్షా పత్రాలున్నాయి. డివిజినల్ అకౌంట్స్ అధికారి పరీక్షకు సంబంధించి జనరల్ స్టడీస్, మాథ్స్ ప్రశ్నపత్రాలను అధికారులు గుర్తించారు.
ఏఈ పరీక్షకు సంబంధించి జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్ పేపర్ 1 ప్రశ్నపత్రాలు, సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పేపర్ 2 ప్రశ్నపత్రాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్లు వారు తేల్చారు. టౌన్ ప్లానింగ్ పరీక్షకు సంబంధించి ఒకేషనల్, ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు బయటపడ్డాయి. జూలైలో జరగాల్సిన జూనియర్ లెక్చరర్ ప్రశ్నపత్రాలు కూడా పెన్‌డ్రైవ్‌లో గుర్తించారు. గ్రూప్-1, ఏఈఈ, డీఏఓ, ఏఈ పరీక్షలు ఇప్పటికే జరగడంతో వాటిని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు రద్దు చేశారు. ఇదే కాకుండా.. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలను వాయిదా వేశారు. కొన్ని నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలను సైతం టీఎస్‌పీఎస్‌సీ అధికారులు వరుసగా ప్రకటిస్తూ వస్తున్నారు.
షమీమ్ ఇంట్లో ల్యాప్‌టాప్, కంప్యూటర్ స్వాధీనం : పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను మూడో రోజు సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. "షమీమ్ కంప్యూటర్ నుంచి ప్రశాంత్‌రెడ్డికి.. గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్ పంపించాడు. ఎనీ డెస్క్ అప్లికేషన్‌ను షమీమ్ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసిన రాజశేఖర్... పెన్‌డ్రైవ్ ద్వారా సమాచారాన్ని చోరీ చేశాడు. తనపై నిఘా ఉండటంతో షమీమ్ కంప్యూటర్‌ను రాజశేఖర్ ఉపయోగించుకున్నట్టు" పోలీసులు గుర్తించారు. 'మరోవైపు గ్రూప్-1 కు షమీమ్ దరఖాస్తు చేసుకున్నట్లు రాజశేఖర్ గుర్తించి... తనకు కూడా ప్రశ్నాపత్రం ఇస్తానని చెప్పడంతో అతను అంగీకరించాడు.' అని సిట్ తెలిపింది. దర్యాప్తులో వచ్చిన సమాచారంతో షమీమ్ ఇంట్లో ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.