తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు'.. హైకోర్టులో రాజశేఖర్ భార్య పిటిషన్ - నిందితులను వివిధ కోణాల్లో విచారణ

TSPSC Paper Leakage latest update: ప్రశ్నాపత్రం లీకేజ్‌ కేసు నిందితుడు రాజశేఖర్ భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. తన భర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. రాజశేఖర్‌కు వైద్య పరీక్షలు చేయించాలని కోర్టును కోరారు.

paper leak
paper leak

By

Published : Mar 20, 2023, 3:08 PM IST

Updated : Mar 20, 2023, 3:46 PM IST

TSPSC Paper Leakage latest update: రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్ భార్య సుచరిత తెలంగాణ హైకోర్టులో పిటివేషన్ వేశారు. రాజశేఖర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని పిటిషన్‌లో వెల్లడించారు. వైద్య పరీక్షలు చేయించాలని రాజశేఖర్ భార్య కోర్టును కోరారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌కు కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించామని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. కస్టడీ ముగిశాక కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షలు చేయిస్తామని న్యాయవాది తెలిపారు. నాంపల్లి కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ జరుగుతుందని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

రాజశేఖర్‌పై థర్డ్ డిగ్రీ విషయమై కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన భార్య సుచరిత కోర్టును కోరింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సమస్య ఉంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని సూచించింది ధర్మాసనం.

ఇక ఈ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. పేపర్ లీకేజీపై ఆరోపణలు చేస్తున్న వారికీ సిట్ నోటీసులు కూడా ఇచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆధారాలు ఉంటే సిట్‌కు సమర్పించాలని తెలిపారు. మరికొంత మందికి నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్ ఉంది. ఇక దీనిపై రేవంత్‌రెడ్డి స్పందించాడు. సిట్ నోటీసులు అందలేదని స్ఫష్టం చేశారు. ఆధారాలు సిట్‌కు ఇచ్చేది లేదు అని రేవంత్ తేల్చి చెప్పారు. సిట్ నోటీసులకు భయపడమని పేర్కొన్నారు.

ఇక ఈ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఒకవైపు సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు.. నిందితుల ఫోన్లు, ఇతర డిజిటల్‌ ఉపకరణాలను జల్లెడ పడుతున్నారు. మరో వైపు సిట్‌లోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. టౌన్‌ప్లానింగ్‌ పరీక్ష పేపర్​తో మొదలైన లీకేజీ ప్రభావం.. గత అక్టోబరు నుంచి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన అన్ని పరీక్షలపై పడటంతో.. మొత్తం 7 పరీక్షల్లో 4ను కమిషన్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రశ్నపత్రాలు ఉంచిన కంప్యూటర్‌ను రాజశేఖర్‌రెడ్డి అక్టోబరులోనే యాక్సెస్‌ చేసినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడి కావడమే ఇందుకు కారణం. ఈ పరీక్షల్లో గ్రూప్‌-1 ప్రధానమైంది. విషయం నిర్ధారణ అయిన తర్వాతే గ్రూప్‌-1 పరీక్షను రద్దుచేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 20, 2023, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details