TSPSC Paper Leak News in Telugu: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు సర్వీస్ కమిషన్ కార్యాలయం నుంచే ప్రశ్నపత్రాలు లీకైన విషయం వెలుగులోకి రాగా.. పరీక్షా కేంద్రం నుంచి వాట్సప్‌లోనూ బయటకు వచ్చినట్టు సిట్ బృందం నిర్ధారణకు వచ్చింది. హైటెక్ మాస్ కాపీయింగ్‌కు తెరలేపిన విద్యుత్ శాఖ డీఈ రమేశ్ అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఏఈఈ, డీఏవో పరీక్షలకు హాజరైన 11 మంది అభ్యర్థులకు చెవిలో ఇమిడిపోయేలా బఠాణి గింజంత స్పీకర్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష తర్వాత చెవిలో నుంచి బయటికి తీసేందుకు ఇయర్‌బడ్ రూపంలో ఉన్న మాగ్నెటిక్ పరికరాన్ని వినియోగించారు. చిన్నపాటి చిప్‌తో కూడిన డివైజ్‌ను బనియన్‌లో కుట్టిన ప్రత్యేక అరలో బిగించిన ముఠా.. ఆ బనియన్ భుజం వద్ద మైక్రోఫోన్ అమర్చింది. పరీక్షలో హైటెక్ మాస్ కాపీయింగ్ ఎలా చేయాలో వారికి తర్ఫీదు ఇచ్చేందుకు మలక్‌పేట టీవీ టవర్ ప్రాంతంలో ఖాలేద్ అనే వ్యక్తి ఇంట్లో ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సమాధానాలు చేర వేసేందుకు ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా ఓ సహాయకుడిని రమేశ్ ముఠా అందుబాటులో ఉంచిందని సిట్ గుర్తించింది.
- ఇవీ చూడండి..:Accused used chat GPT to cheat in TSPSC Exams : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. చాట్ జీపీటీతో ఏఈఈ పరీక్ష
TSPSC Paper Leak : అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎలా వ్యవహరించాలనే విషయంలో రమేశ్ ముఠా ప్రత్యేక సూచనలు చేసింది. అరగంట ముందే కేంద్రంలోకి వెళ్లి ఏ బెంచీలో కూర్చున్నామనే విషయాన్ని మైక్రోఫోన్ ద్వారా కంట్రోల్ రూంలోని సహాయకుడికి చేరవేసేలా ప్రణాళిక రచించింది. ఉదాహరణకు ఓ అభ్యర్థి నాలుగో వరుసలో ఉన్న బెంచీలో కూర్చుంటే.. అతడికి డీ సిరీస్ ప్రశ్నపత్రం వచ్చిందని అర్థం. అదే విషయాన్ని సహాయకుడికి చేరవేస్తే అతను డీ సిరీస్ సమాధానాలు చెబుతాడు. అలాగే సమాధానాలు రాసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకు 'రెడీ.. రెడీ' అని మాత్రం చెప్పాలని ముఠా సూచించింది.
AI ChatGPT used in TSPSC Paper Leak : ప్రశ్నపత్రాన్ని వాట్సప్ ద్వారా లీక్ చేసేందుకు ఓ ఇన్విజిలేటర్‌ను మాట్లాడుకున్నట్లు రమేశ్ ముఠా నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. అతడు ఎవరనేది గుర్తించారు. టోలిచౌకీ ప్రాంతంలో నివసించే అలీ అనే ప్రిన్సిపల్ ఆ నిర్వాకానికి పాల్పడినట్లు తేలింది. అతడు వాట్సప్‌లో ప్రశ్నపత్రాలు పంపగానే.. రమేశ్ ముఠా చాట్‌జీపీటీ ద్వారా సమాధానాలు సిద్ధం చేసి వాటిని పరీక్ష కేంద్రంలోని అభ్యర్థులకు చెప్పింది. ఆ వ్యవహారంలో మరో 20 మంది వరకు ప్రమేయముందని గుర్తించిన సిట్.. నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమైంది. ఆ హైటెక్ కాపీయింగ్‌కు సహకరించినందుకు.. ఒక్కో అభ్యర్థి నుంచి రమేశ్ ముఠా రూ.20 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు దండుకున్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు.
రమేశ్ చరిత్రపై ఆరా..: పెద్దపల్లి జిల్లా విద్యుత్ శాఖలో పని చేస్తున్న డీఈ రమేశ్.. హైటెక్ కాపీయింగ్‌కు ఆద్యుడు కావడంతో అతడి చరిత్రపై సిట్ ఆరా తీస్తోంది. మూడేళ్ల క్రితం ప్రమాదానికి గురైనప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న అతను.. భారీ స్థాయిలో కాపీయింగ్‌కు పాల్పడటంతో గతంలో ఏమైనా ఇలాంటి దందాలు సాగించాడా అని తెలుసుకునేందుకు సిట్ యత్నిస్తోంది. హైటెక్ కాపీయింగ్ గురించి ఆ ముఠా ఇంటర్నెట్‌లో శోధించి డివైజ్‌లను సమకూర్చుకున్నట్లు గుర్తించారు. గతంలోనూ రమేశ్‌పై ఒకటి, రెండు కేసులున్నట్లు తెలుస్తుండటంతో వాటిపై కూపీలాగుతోంది. పూర్తి సమాచారం కోసం అతడిని అదుపులోకి తీసుకునేందుకు సిట్ కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. లీకేజీ కేసులో అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న రవికిషోర్, దివ్య, రాయపురం విక్రమ్, భరత్ నాయక్, పసికంటి రోహిత్ కుమార్, గాదె సాయిమధును సిట్ ఇప్పటికే కస్టడీలోకి తీసుకుంది.