తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Mass Arrests in TSPSC Paper Leak Case : త్వరలో మూకుమ్మడి అరెస్టులు.. ఒకేసారి మరో 100 మంది..! - టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ

TSPSC Paper Leak Case Updates : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో త్వరలోనే మూకుమ్మడి అరెస్టులకు సిట్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 50 మంది వరకు అరెస్టు కాగా.. మరో ఒకటి, రెండు వారాల్లో ఒకేసారి అనేక మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారిలో డీఈఈ రమేశ్‌ ద్వారా లబ్ధి పొందిన వారే అధికంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Mass Arrests in TSPSC Paper Leak Case
Mass Arrests in TSPSC Paper Leak Case

By

Published : Jun 5, 2023, 11:49 AM IST

TSPSC Paper Leak Case Latest Updates : రోజురోజుకో మలుపు తిరుగుతున్న టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దూకుడు పెంచింది. ఇప్పటి వరకు నిందితులను ఒకరిద్దరిగా అరెస్ట్‌ చేసిన అధికారులు.. ఇప్పుడు మూకుమ్మడి అరెస్టులకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు గత మూడు నెలలుగా జరుగుతున్న దర్యాప్తులో ఇప్పటి దాకా 50 మంది వరకు అరెస్టయ్యారు. తాజాగా మరో ఒకటి, రెండు వారాల్లో ఒకేసారి అనేక మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అరెస్ట్‌ చేయబోయే వారిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 'మాస్‌ కాపీయింగ్‌ మాస్టర్' డీఈఈ రమేశ్‌ ద్వారా లబ్ధి పొందిన వారే 30 వరకూ ఉండొచ్చని తెలుస్తోంది.

Arrest in TSPSC Paper Leak Case : ఈ కేసులో కమిషన్‌ ఉద్యోగుల ద్వారా ప్రశ్నపత్రాలు అంచెలంచెలుగా అనేక మందికి చేరినట్లు తొలుత అంతా భావించారు. అయితే.. టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ఉద్యోగులతో సంబంధం లేకుండా ఓ ప్రిన్సిపల్‌ సాయంతో మాస్‌ కాపీయింగ్‌ చేయించిన విద్యుత్‌ శాఖ డీఈఈ రమేశ్‌ ముఠాను ఇటీవల సిట్‌ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు చేతికి వచ్చాక తన ఇంటి సమీపంలో ఉండే టీఎస్‌పీడీసీఎల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేసే సురేశ్‌కు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. అతడు డీఏవో/ఏఈఈ క్వశ్చన్‌ పేపర్లను సుమారు 25 మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడని.. అతడి ద్వారా అతడి బంధువైన డీఈఈ రమేశ్‌ రంగ ప్రవేశం చేశాడని సిట్‌ వెల్లడించింది. ప్రస్తుతం సురేశ్‌, రమేశ్‌తో పాటు మొత్తం ఏడుగురిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇతడు 30 మందికి.. అతడు 78 మందికి..: డీఈఈ రమేశ్‌.. డీఏవో, ఏఈఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసిన ఓ కళాశాల ప్రిన్సిపల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఓ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుని మాస్‌ కాపీయింగ్‌కు తెరలేపాడు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి రూ.30 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుని.. డీఏవో పరీక్షలో ముగ్గురితో, ఏఈఈ పరీక్షలో నలుగురితో మాస్‌ కాపీయింగ్‌ చేయించాడు. అంతేకాక ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మరో 30 మందికి అమ్ముకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సురేశ్‌ సైతం మొదటి 25 మంది కాకుండా మరో 78 మందికి ఏఈఈ ప్రశ్నపత్రాన్ని అమ్ముకున్నట్లు సిట్‌ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే సురేశ్‌, రమేశ్‌లను ప్రశ్నిస్తున్న అధికారులు.. వారి వాంగ్మూలాల నమోదు తర్వాత ఇతరత్రా ఆధారాలు సేకరించి భాగస్వామ్యం ఉన్న వారందరినీ మూకుమ్మడిగా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

డిబార్‌ అయినవారి వివరణ సంతృప్తికరంగా లేదు..: మరోవైపు ఈ కేసులో 50 మంది నిందితులను కమిషన్ డిబార్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే వారిలో 16 మంది తమపై ఉన్న డిబార్‌ను ఎత్తివేయాలని వివరణ ఇవ్వగా.. ఆ వివరణ సంతృప్తికరంగా లేదంటూ టీఎస్‌పీఎస్సీ తోసిపుచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పరీక్షలకు హాజరుకావద్దని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details