TSPSC Secretary Attends SIT Inquiry today: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సిట్ కార్యాలయానికి హాజరైన అనితా రామచంద్రన్ విచారణ మధ్యాహ్నం ముగిసింది. ప్రవీణ్‌కు సంబంధించిన అంశాలపై ఆమెను అధికారులు ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ పరిపాలన, కాన్ఫిడెన్షియల్ విభాగంపై విచారించారు. ఇందులో భాగంగానే అనితా రామచంద్రన్ స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. అనంతరం ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనితా రామచంద్రన్ వద్ద పీఏగా ప్రవీణ్ పనిచేస్తున్నాడు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రవీణ్..
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి 103 మార్కులు సాధించాడు. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డి కూడా ఇవాళ సిట్ విచారణ ముందు హాజరయ్యారు. కార్యదర్శి అనితా రామచంద్రన్ విచారణ తరువాత... లింగారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. లీకేజ్ కేసులో నిందితుడిగా ఉన్న రమేశ్.. లింగారెడ్డి వద్ద పీఏగా విధులు నిర్వహిస్తున్నాడు.
మరోవైపు గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో వందకుపైగా మార్కులు సాధించినవారిలో ఇప్పటి వరకూ వంద మందిని విచారించి.. వారి వాంగ్మూలం నమోదు చేశారు. మిగిలిన 21 మందిని రెండు మూడ్రోజుల్లో ప్రశ్నించనున్నట్టు సిట్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ ప్రశ్నపత్రం లీక్ చేసిన ప్రవీణ్, రాజశేఖర్ ద్వారా పరీక్ష రాసిన వారితో సహా మొత్తం 15మందిని అరెస్టు చేశారు. ఎంత మందికి ప్రశ్నపత్రాలు చేరాయి, వారి ద్వారా ఎవరికి నగదు అందిందనే కోణంలో సిట్ అధికారులు వారిని ప్రశ్నించనున్నారు.