TSPSC paper leak case latest update : పోలీసు అధికారిగా తన తండ్రికి లభించిన గౌరవాన్ని కళ్లారా చూశాడు. తానూ కూడా ఆ వృత్తిలో చేరాలని కలలుగన్నాడు. అందుకు అడ్డదారులు తొక్కి చివరికి కటకటాల పాలయ్యాడు. గ్రూప్ వన్ పేపర్ లీకేజీ వెనుక కారణాలపై సిట్ చేపట్టిన దర్యాప్తులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ లీలలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అదరపు ఎస్పీగా పనిచేస్తున్న తండ్రి విధి నిర్వహణలో మరణించడంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్ కుమార్‌కు ప్రభుత్వ ముద్రణా సంస్థలో ఉద్యోగం వచ్చింది.
Praveen Leaked TSPSC Paper to Become Police officer : అనంతరం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)లోకి వచ్చిన ప్రవీణ్.. అందులోనే ఏఎస్వో వరకు ఎదిగాడు. కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తూ.. నమ్మకాన్ని చూరగొన్నాడు. తాను కూడా తండ్రి లాగా పోలీసు అధికారిని అవుతానంటూ సహచర ఉద్యోగులతో చెబుతూ ఉండేవాడు. కమిషన్ నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేసే పొరుగు సేవల ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డికి రెండు నెలల వేతనం ఆగిపోయింది. అయితే అతనికి ప్రవీణ్ అభయమిచ్చాడు. ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డికి రావాల్సిన వేతనం అందింది. తానే పైరవీ చేసి ఇప్పించానని అతనిని నమ్మించాడు.
గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడనుందనే సమాచారంతో ప్రవీణ్ కాస్త అప్రమత్తమయ్యాడు. పరీక్షను రాసి జైలర్/డీఎస్పీ పోస్టు సంపాదించాలని అనుకున్నాడు. అయితే ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి కలిసి.. గతేడాది అక్టోబరు మొదటి వారంలో ప్రశ్నాపత్రాలను పెన్ డ్రైవ్‌లోకి కాపీ చేశారు. పరీక్ష రాసిన ప్రవీణ్.. లీకేజీ వ్యవహారం బయటపడితే తన ఉద్యోగం పోతుందని భావించి, భయపడి కావాలనే డబుల్ బబ్లింగ్ చేశాడు. తన చేతికి వచ్చిన ప్రశ్నాపత్రాలను విక్రయించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని పథకం పన్నాడు.