TSPSC New Exam Dates: టీఎస్పీఎస్సీ కమిషన్‌లోని ప్రశ్నాపత్రాలు లీకైనట్లు గుర్తించి.. మరో ఐదు నియామక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన 5 పరీక్షలను వాయిదా వేసింది. వాటిని వాయిదా వేస్తూ.. మళ్లీ ఆ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అందులో భాగంగా మే 16న అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్ష.. మే 19న డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్షను నిర్వహించనున్నారు. అలాగే జూన్ 28న అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్ష జరుపనున్నారు. జులై 18,19న భూగర్భ జలశాఖలో గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్షను.. జులై 20,21న భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
ఐదు పరీక్షలను వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ.. వాటి కొత్త తేదీలు ఇవే
19:38 April 15
టీఎస్పీఎస్సీ నియామక పరీక్షల కొత్త తేదీలు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల ఇప్పటికే పలు పరీక్షలు రద్దయ్యాయి. మరికొన్ని నియామక పరీక్షలు వాయిదాలు పడ్డాయి. ఈ జాబితాలోకి తాజాగా మరో ఐదు నియామక పరీక్షలు చేరాయి. ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన ఆ ఐదు పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీంతో నిరుద్యోగులు ఇన్ని రోజులు కష్టపడి చదివిన సమయం అంతా వృథా అవుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఇంతలోనే ఆ పరీక్షలను రాసే అభ్యర్థులకు భారీ ఊరటను ఇస్తూ.. మే, జూన్, జులై నెలల్లో నిర్వహిస్తామని చెప్పి కొత్త తేదీలను ప్రకటించింది.
సిట్ నుంచి ఈడీ వరకు జరిగిన దర్యాప్తు వివరంగా: గత నెల మార్చి 11న టీఎస్పీఎస్సీలోని అసిస్టెంట్ ఇంజనీర్, వెటర్నరీ పరీక్ష పత్రాలు లీకైనట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారు టీఎస్పీఎస్సీ కమిషన్ ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేశారు. అధికారులు చెక్ చేసుకున్న తర్వాత తమ పేపర్ లీకేజీ జరినట్లు ఒప్పుకున్నారు. వెంటనే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే రాజకీయంగా అనేక విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అందులో ప్రధానంగా గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం కూడా లీక్‌నకు గురైనట్లు ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. సిట్ అధికారులు గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీకేజీ అయినట్లు భావిస్తూ.. ఆ దిశగా దర్యాప్తును కొనసాగించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు గ్రూప్-1తో సహా టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్, గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్, మోటారు వెహికల్స్ ఇన్స్పెక్టర్తో సహా ఇంకా మరిన్ని పేపర్లు లీకైనట్లు గుర్తించారు. ప్రధాన నిందితునిగా రాజశేఖర్ రెడ్డిని గుర్తించారు. వారితో పాటు ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో మొత్తం 17 మందిని నిందితులుగా చేర్చుతూ.. సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇందులో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు గుర్తించి.. ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది.
ఈ క్రమంలో ఈడీ అధికారులు కాన్ఫిడెన్సియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మిని విచారించారు. అంతకు ముందు సిట్ అధికారులు కూడా ఆమెను విచారించినప్పుడు ఆమె వద్ద నుంచి డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే నిందితులు ఆ డైరీలోనిి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను దొంగలించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. కాని సిట్ అధికారులు ఎక్కడా డైరీలో యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటివి లేవని తెలిపారు. అదే విషయాన్ని సిట్ అధికారులు అడినప్పుడు ఆమె తెలిపారు. ఇప్పుడు కూడా ఈడీ అడిగినప్పుడు అదే విషయాన్ని చెప్పారు. ఈ కేసులో రూ.40 లక్షలు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తోంది. ప్రధాన నిందితులు అయిన ప్రవీణ్, రాజశేఖర్‌లను తమకు కస్టడీలోకి ఇవ్వాలని ఈడీ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఈ శనివారం అందుకు అంగీకరిస్తూ.. చంచల్ గూడ జైలు అధికారులను వారికి సహకరించాలని కోర్టు సూచించింది. మరి ఈ కేసులో అసలు నిజం తెలుస్తుందో లేదో చూడాలి.
ఇవీ చదవండి: