TSPSC Paper Leakage Case update: ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టును రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోరింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌పై టీఎస్‌పీఎస్‌సీ తరఫున లీగల్ నోడల్ అధికారి సుమతి కౌంటరు దాఖలు చేశారు. కాన్ఫిడెన్షియల్ గదిలోని సమాచారం బయటకు వెళ్లిందన్న అనుమానంతో బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.
ఆ తర్వాత కేసు సిట్‌కు బదిలీ అయిందని.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టుకు కమిషన్ వివరించింది. ముందస్తు చర్యగా మూడు పరీక్షలు వాయిదా వేయడంతో పాటు.. నాలుగు పరీక్షలను రద్దు చేసినట్లు పేర్కొంది. ఆరోపణల్లో నిజం లేదని.. పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. పిటిషన్ వేసిన బల్మూరి వెంకట్, తదితరులు కూడా లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. టీఎస్‌పీఎస్‌సీ సభ్యులు, ఐటీ శాఖలోని కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నందున వాటన్నింటిపై సిట్ దర్యాప్తు చేయలేదని పిటిషనర్లు పేర్కొన్నారు.