TSPSC Paper Leak Case Latest Updates: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కేవలం ఏఈ ప్రశ్నాపత్రమే లీకైనట్లు.. టీఎస్‌పీఎస్సీ అధికారులు మొదట భావించినప్పటికి.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఏఈఈ, డీఏఓ పరీక్షా పత్రాలు కూడా బయటికి వెళ్లినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. గత ఏడాది అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్, జనవరి 22న నిర్వహించిన ఏఈఈ, ఫ్రిబ్రవరి 26న నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ అధికారి పరీక్షా పత్రాలు లీకైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఆ మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి జూన్ 11న నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది. మిగతా పరీక్షా తేదీలకు సంబంధించి త్వరలో వివరాలు వెల్లడించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. మార్చి 5న నిర్వహించిన ఏఈ పరీక్షా పత్రం కూడా లీకైనట్లు తేలడంతో ఇది వరకే.. ఈ పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్,.. 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరి అసిస్టెంట్ ఉద్యోగాలకు పరీక్ష జరగక ముందే వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 11న టీఎస్‌పీఎస్సీ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మొత్తం 26 నోటిఫికేషన్లు జారీ: టీఎస్‌పీఎస్సీ గతేడాది నుంచి ఇప్పటి వరకు మొత్తం 26 నోటిఫికేషన్లు జారీ చేశారు. 41 కేటగిరిల్లో 23,000 ఉద్యోగాలకు సంబంధించి 26 నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇందులో ఇప్పటికే 7 పరీక్షలను నిర్వహించారు. గ్రూప్- 1 ప్రిలిమ్స్‌తో పాటు, ఏఈఈ, డీఏఓ, ఏఈ, ఫుడ్ ఇన్స్ పెక్టర్,.. మహిళ, శిశు సంక్షేమ శాఖలోని సీడీపీఓ, గ్రేడ్-1 సూపర్‌వైజర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఇప్పటికే నాలుగింటిని రద్దు చేశారు.