పంజాబ్ కాంగ్రెస్‌లో వర్గపోరు సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ ముందు ఆ పార్టీ నేత నవ్‌జోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. సమస్యలపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. పంజాబ్ రాష్ట్రం సాధించే ఫలాలు ప్రతి పౌరుడికీ అందాలని పేర్కొన్నారు.
"హైకమాండ్ పిలుపుతో నేనిక్కడికి(దిల్లీ) వచ్చాను. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలపై హైకమాండ్‌కు వివరించాను. పంజాబ్ ప్రజల గళాన్ని క్షేత్రస్థాయి నుంచి పార్టీ అధిష్ఠానానికి వివరించాను. నా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, ఉండబోదు. కమిటీ ముందు నిజాన్ని ఉంచాను. నిజాన్ని అణచివేయొచ్చేమో కానీ ఓడించలేరు. పంజాబ్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఓడించాలి. ప్రజల అధికారం ప్రజలకే అప్పగించాలి. పంజాబ్ పురోగతిలో ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడిని భాగస్వామ్యం చేయాలి."
-నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ కాంగ్రెస్ నేత