తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలు- అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రం - ట్రక్కు డ్రైవర్ల న్యూస్

Truckers Strike Today : భారత న్యాయ సంహిత చట్టంలోని హిట్‌ అండ్‌ రన్‌ కేసులపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ప్రకటించింది. అందరితో చర్చించాకే భారతీయ నాయ సంహితలోని సెక్షన్ 106/2 అమల్లోకి వస్తుందని అన్నారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. ఈ క్రమంలో ఆల్​ఇండియా ట్రాన్స్​పోర్టు సంఘాలతో సమావేశమయ్యారు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. మరోవైపు, 'హిట్‌ అండ్‌ రన్‌' కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనను వ్యతిరేకిస్తోన్న ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది.

Truckers Strike Today
Truckers Strike Today

By PTI

Published : Jan 2, 2024, 10:44 PM IST

Truckers Strike Today :కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 'హిట్‌ అండ్‌ రన్‌' కేసులకు సంబంధించి దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన బాట పట్టిన వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్‌పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ప్రకటన చేశారు. ట్రక్కు డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో ఆలిండియా ట్రాన్స్‌పోర్టు సంఘాలతో అజయ్‌ భల్లా సమావేశమయ్యారు. అందరితో చర్చించిన తర్వాతనే కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని హామీ ఇచ్చారు. ట్రక్టు డ్రైవర్లు సమ్మె విరమించాలని కోరారు.

కాంగ్రెస్ మద్దతు
భారతీయ న్యాయ సంహిత చట్టంలో 'హిట్‌ అండ్‌ రన్‌' కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనను వ్యతిరేకిస్తోన్న ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ చర్యలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు తీవ్రంగా మండిపడ్డారు. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను నిలిపివేసిన ప్రభుత్వం పేదలపై జరిమానా విధించేందుకు సిద్ధమైందని విమర్శించారు. ఈ చట్టం దుర్వినియోగమైతే దోపిడీదారు నెట్‌వర్క్‌, వ్యవస్థీకృత అవినీతికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను నిలిపివేస్తూ పేదలపై జరిమానా విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పరిమిత సంపాదనతో కష్టపడి పనిచేసే వారికి కఠిన శిక్షలు విధించడం వారి జీవితాలపై చెడు ప్రభావం చూపిస్తుందన్నారు. కేవలం ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక వ్యూహాలు రచిస్తోందని ప్రజలకు చేస్తుందేమీ లేదని అన్నారు.

ప్రభావిత వర్గాలతో సంప్రదింపులు జరపకుండా, ప్రతిపక్షాలతో చర్చించకుండా చట్టాలను రూపొందించడం ప్రజాస్వామ్యంపై నిరంతరం దాడి చేయడమేనని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. 150 ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సమయంలో ఈ చట్టాన్ని రూపొందించారని దీని వల్ల తీవ్ర పర్యవసానాలు ఉండొచ్చన్నారు. ఇదిలాఉంటే, భారత శిక్షాస్మృతి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు సంబంధించి 'హిట్‌ అండ్‌ రన్‌' కేసుల్లో కఠిన శిక్ష, భారీ జరిమానా పొందుపరిచారు. దీనిపైనే ట్రక్కు డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్త ఆందోళనలకు దిగిన నేపథ్యంలో దేశంలోని 2000 పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు అయిపోయాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్‌లోని కొన్ని పెట్రోల్ బంకుల్లో వాహనదారుల భారీ రద్దీ కారణంగా స్టాక్ అయిపోయిందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details