Kanwar Yatra: ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరిద్వార్‌లో కాంవడ్ యాత్రకు వెళ్లి తిరిగి గ్వాలియర్‌లోని తమ ఇళ్లకు వెళ్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
భక్తులను ఢీకొట్టిన ట్రక్కు డ్రైవర్.. పరారైనట్లు తెలుస్తోంది. నిందితుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకొని శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.
శివుడి భక్తులు ఏటా కాంవడ్ యాత్రకు వెళ్తుంటారు. ఈ భక్తులను కాంవడియాలుగా పిలుస్తారు. వీరు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి, బిహార్‌లోని సుల్తాన్‌గంజ్ వంటి పవిత్ర ప్రాంతాల నుంచి గంగాజలం ఇంటికి తీసుకెళ్లి.. దేవుడ్ని పూజిస్తారు. కరోనా కారణంగా.. రెండేళ్లుగా కాంవడ్ యాత్ర జరగలేదు. ఈసారి కొవిడ్ నిబంధనల నడుమ పునఃప్రారంభమైంది.