తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రక్కు డ్రైవర్ల నిరసనతో ఇంధన కొరత! పెట్రోల్‌ బంక్​లలో ఫుల్ రష్​

Truck Driver Strike Petrol Pump Crowd : దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్ల నిరసనతో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు క్యూ కడుతున్నారు.

Truck Driver Strike Petrol Pump Crowd
Truck Driver Strike Petrol Pump Crowd

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 12:01 PM IST

Updated : Jan 2, 2024, 12:41 PM IST

Truck Driver Strike Petrol Pump Crowd : భారత న్యాయ సంహిత చట్టంలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన ఆందోళన మంగళవారం కూడా కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. అయితే డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

మధ్యప్రదేశ్​లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులు

పెట్రోల్‌ బంక్​లకు పోటెత్తిన వాహనదారులు
దీంతో ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్‌ బంక్​లకు పోటెత్తారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో సోమవారం రాత్రి నుంచి పెట్రోల్‌ బంక్‌లు కిటకిటలాడుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లోనూ ఇదే పరిస్థితి కన్పించింది.

మధ్యప్రదేశ్ పెట్రోల్ బంక్​ల వద్ద బారులు తీరిన ప్రజలు

కొన్నిచోట్ల అయితే బంక్​ల వద్ద వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ఎల్‌పీజీ సిలిండర్లు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అయితే నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి.

ఆందోళనకు కారణమిదే
భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధన ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిపై ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు చెబుతున్నాయి

అయితే డ్రైవర్ల నిరసనపై ఆల్ ఇండియా మోటార్ అండ్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర కపూర్ స్పందించారు. "ప్రభుత్వానికి మా ఏకైక డిమాండ్ ఏమిటంటే, మాతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కొత్త చట్టం గురించి ఎవరితోనూ చర్చ జరగలేదు. దీని గురించి ఎవరినీ అడగలేదు. ఆల్​ఇండియా మోటార్ అండ్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ సభ్యులు ఎటువంటి నిరసన ప్రకటించలేదు. ఈ అంశంపై చర్చ జరగాలి. నిరసన ఎప్పటికీ పరిష్కారం కాదు. ప్రభుత్వం మా సభ్యులతో చర్చలు జరుపుతుందని నమ్ముతున్నాం" అని చెప్పారు.

ఇకపై రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం​- నాలుగు నెలల్లో అమలు!

Last Updated : Jan 2, 2024, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details