వంద శాతం మందికి టీకా పంపిణీ చేసిన రాష్ట్రం దిశగా త్రిపుర అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారు.. 26.24 లక్షల మంది ఉండగా.. వారిలో ఇప్పటికే.. 22.46లక్షల మంది మొదటి డోసు టీకా తీసుకున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ తెలిపారు. మంగళ, బుధవారాల్లో నిర్వహిస్తున్న స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంతో.. వందశాతం మందికి టీకా పంపిణీ చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రజలంతా టీకా తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని.. మంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రజా ప్రతినిధులను కోరారు.
"వంద శాతం మంది త్రిపుర వాసులు.. కొవిడ్ టీకా తీసుకునేలా మేము చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో వంద శాతం మందికి టీకా పంపిణీ చేసిన మొదటి రాష్ట్రంగా త్రిపుర నిలుస్తుంది. ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ మహా యజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. వారికి అభినందనలు."
-విప్లవ్ కుమార్ దేవ్, త్రిపుర సీఎం