తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మిస్టర్ క్లీన్' సీఎం మేజిక్.. త్రిపురలో బీజేపీ విక్టరీ - త్రిపుర ఎన్నికలు 2023

త్రిపురలో కాషాయ జెండా వరుసగా రెండోసారి ఎగిరింది. శాసనసభ ఎన్నికల్లో అధికార భాజపా కూటమి 33 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్​-వామపక్ష కూటమి 14 స్థానాలతో సరిపెట్టుకుంది. తిప్రా మోతా పార్టీ 13 చోట్ల విజయం సాధించింది. మరోసారి ముఖ్యమంత్రి పీఠం మాణిక్ సాహానే వరించనున్నట్లు తెలుస్తోంది.

tripura election result 2023
త్రిపుర ఎన్నికలు 2023

By

Published : Mar 2, 2023, 5:04 PM IST

Updated : Mar 2, 2023, 8:40 PM IST

త్రిపురలో బీజేపీ వరుసగా రెండో సారి విజయకేతనం ఎగురవేసింది. భాజపా- ఐపీఎఫ్​టీ కూటమి 33 సీట్లను గెలుచుకుంది. పొత్తుతో బరిలోకి దిగిన కాంగ్రెస్-వామపక్ష కూటమి ఈ ఎన్నికల్లో కూడా ఎదురుదెబ్బతింది. ఈ కూటమి 14 సీట్లను గెలుచుకుంది. అనుహ్యంగా ఎన్నికల బరిలోకి దిగిన తిప్రా మోతా పార్టీ 13 స్థానాలు దక్కించుకుని రాష్ట్రంలో సత్తా చాటింది. త్రిపురలో బీజేపీ విజయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా కృషి చాలా ఉందని పార్టీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

2023 త్రిపుర శాసనసభ ఎన్నికల్లో పార్టీలవారీగా సాధించిన సీట్లు..

  • భాజపా కూటమి- 33
  • కాంగ్రెస్-వామపక్ష కూటమి- 14
  • తిప్రా మోతా పార్టీ- 13

'మిస్టర్ క్లీన్'​గా పేరున్న మాణిక్ సాహా టౌన్ బర్దోవాలి నుంచి 1,257 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అశిశ్ కుమార్ సాహాపై విజయం సాధించారు. ఈ క్రమంలో రెండో సారి కూడా త్రిపుర ముఖ్యమంత్రి పీఠం మాణిక్ సాహానే వరిస్తుందని తెలుస్తోంది. మాణిక్ సాహా 2022లోనే త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పార్టీ అసమ్మతి నేతలను కలుపుకుంటూ ముందుకు సాగారు. అలాగే క్లీన్ ఇమేజ్​ను సంపాదించుకున్నారు. సాహా.. స్వతహాగా వైద్యుడు. స్థానికంగా ఆయనకు మంచి పేరు ఉండడం పార్టీ విజయంలో సహాయపడిందని విశ్లేషకులు అంటున్నారు.

2018లో మూడు దశాబ్దాల వామపక్షాల పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. సీఎం పీఠాన్ని బిప్లవ్ కుమార్​ దేవ్​కు అప్పగించింది. ఆయన వివాదస్పద వ్యాఖ్యలు, శాంతి భద్రతలు నెలకొల్పడంలో విఫలమయ్యారు. దీంతో ఆయనను తప్పించి బీజేపీ అధిష్ఠానం మాణిక్ సాహాను 2022లో సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అలాగే బిప్లవ్ దేవ్​ను తొలగించిన తర్వాత పార్టీని మాణిక్ సాహా పార్టీలో ఉన్న అసమ్మతి చక్కదిద్దారు.

బీజేపీ విజయానికి కారణాలు..

  • ఎన్నికలకు ఏడాది ముందు ముఖ్యమంత్రి మార్పు
  • డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ సాగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం
  • మోదీ చరిష్మా, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా క్లీన్ ఇమేజ్​
  • త్రిముఖ పోటీ నెలకొనడం
  • కాంగ్రెస్​-వామపక్షాల పొత్తును ప్రజలు జీర్ణించుకోలేకపోవడం
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం

2018 త్రిపుర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి, వామపక్షాల మధ్య నువ్వా- నేనా పోటీ నడిచింది. అయితే అనుహ్యంగా ఈ సారి ఎన్నికల్లో తిప్రా మోథా పార్టీ రంగంలోకి దిగింది. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. ట్రైబల్ బెల్ట్​లో మంచి పట్టున్న తిప్రా మోతా పార్టీ ప్రభావం చూపింది. తిప్రా మోతా పార్టీకి అధ్యక్షుడు ప్రద్యోత్‌దేవ్‌ వర్మ. ఆయన ప్రత్యేక రాష్ట్రం 'తిప్రాల్యాండ్​' కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో హంగ్​ వస్తే తిప్రా మోతా పార్టీ కింగ్ మేకర్​గా అవతరించేది. కానీ.. భాజపా-ఐపీఎఫ్​టీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. మరోవైపు తిప్రా మోతా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తిప్రాల్యాండ్ మిగతా డిమాండ్లన్నింటినీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ తెలిపింది.

Last Updated : Mar 2, 2023, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details