తెలంగాణ

telangana

ETV Bharat / bharat

త్రిపురలో ప్రశాంతంగా పోలింగ్.. ఓటేసిన సీఎం మాణిక్ సాహా.. ప్రజలకు మోదీ విజ్ఞప్తి - ఓటు హక్కు వినియోగించుకున్న మాణిక్ సాహా

త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తన ఓటు హక్కును అగర్తలాలో వినియోగించుకున్నారు. మొత్తం 60 స్థానాలకు 259 మంది బరిలో ఉన్నారు.

tripura election 2023
త్రిపుర ఎన్నికలు

By

Published : Feb 16, 2023, 7:04 AM IST

Updated : Feb 16, 2023, 11:41 AM IST

ఈశాన్య రాష్ట్రం త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు క్యూలైన్లలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 60 స్థానాలకు 259 మంది బరిలో ఉన్నారు. త్రిపురలో 28లక్షల 13 వేల మంది ఓటర్లు ఉండగా 3,337 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 1,100 కేంద్రాలను సున్నితమైనవిగా 28 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 11 వరకు 31.23 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఓటేసిన సీఎం మాణిక్ సాహా..
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తన ఓటు హక్కును అగర్తలాలో వినియోగించుకున్నారు. రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. త్రిపురలో కచ్చితంగా భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారని అని మాణిక్ సాహా అన్నారు.

ఓటు వేసేందుకు అగర్తలా వచ్చిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా

'రికార్డు స్థాయిలో ఓటు వేయాలి'
త్రిపుర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రికార్డు స్థాయిలో ఓటు వేసి.. ప్రజాస్వామ్య పండగను బలోపేతం చేయాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

'అవినీతి రహిత పాలన కోసం..'
త్రిపుర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు. ప్రతీ ఓటు సుపరిపాలన, అభివృద్ధి, అవినీతి రహిత త్రిపుర కోసం ఉపయోగపడుతుందని జేపీ నడ్డా ట్వీట్​ చేశారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు, త్రిపుర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. అభివృద్ధి ఆధారిత ప్రభుత్వం ఏర్పడటానికి ఓటు వేయాలని అమిత్ షా తెలిపారు.

ఓటు వేసేందుకు క్యూలైన్​లో వేచి ఉన్న మహిళలు
ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు

భాజపా-ఐపీఎఫ్​టీ పొత్తు..
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-ఐపీఎఫ్‌టీతో కలిసి పోటీ చేస్తుండగా.. సీపీఎం-కాంగ్రెస్‌తో జట్టు కట్టి బరిలో నిలిచింది. తిప్రా మోతా పార్టీ సొంతంగానే ఎన్నికల క్షేత్రంలో తలపడుతోంది. ఈ ఎన్నికల కోసం 31 వేల మంది పోలింగ్‌ సిబ్బంది, 25వేల మంది కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే త్రిపురలో నిషేధాజ్ఞలు విధించగా, ఈ నెల 17 సాయంత్రం 6 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

టౌన్‌ బర్డోవలి నుంచి బరిలో మాణిక్ సాహా..
భాజపా నేత, ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా.. టౌన్‌ బర్డోవలి నుంచి బరిలో నిలవగా.. కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్‌ ధన్‌పుర్‌ నుంచి భాజపా తరఫున పోటీలో ఉన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌధురి.. సబ్రూమ్‌ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. తిప్రా మోతా అధినేత ప్రద్యోత్‌ దెబ్బర్మా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 60 సీట్లకుగాను భాజపా 55 స్థానాల్లో పోటీచేస్తుండగా.. ఆ పార్టీ మిత్రపక్షం ఐపీటీఎఫ్‌ మిగతా చోట్ల బరిలో ఉంది. సీపీఎం 47చోట్ల పోటీ చేస్తుండగా.. మిత్రపక్షం కాంగ్రెస్‌ 13 చోట్ల బరిలో ఉంది. తిప్రా మోతా పార్టీ 42 చోట్ల పోటీ చేస్తోంది.

2018లో త్రిపురలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ పీఠాన్ని నిలుపుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. పూర్వ వైభవాన్ని సాధించేందుకు సీపీఎం శ్రమిస్తోంది. ఓట్ల లెక్కింపు మార్చి 2న జరగనుంది.

Last Updated : Feb 16, 2023, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details